రాష్ట్రంలో అధర్మ పాలన కొనసాగుతోందని మాజీ మంత్రి, భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదినారాయణ రెడ్డి విమర్శించారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో భాజపా జిల్లా కార్యవర్గ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థ దౌర్జన్యంగా జరుగుతోందన్న ఆయన.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అదే జరిగిందని చెప్పారు. రాష్ట్రంలో ప్రతి చోట అవినీతి రాజ్యమేలుతోందని విమర్శించారు.
గ్రామీణ ఉపాధి డబ్బులు 90% కేంద్రం ఇస్తున్నా.. రాష్ట్రంలో మూడేళ్ల నుంచి బిల్లులు పెండింగ్ పెట్టారని ఆరోపించారు. ప్రొద్దుటూరులో అనుమతి లేకుండా టిప్పుసుల్తాన్ విగ్రహం ఏర్పాటుకు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి శంకుస్థాపన చేశారని.. నా ఇష్టం.. నా రాజ్యమన్న ధోరణిలో ఎమ్మెల్యే మాట్లాడుతున్నారని ఆగ్రహించారు.
టిప్పుసుల్తాన్ విగ్రహం ఏర్పాటును వ్యతిరేకిస్తున్నామని ఆయన చెప్పారు. అమృత్ పథకం కింద మైలవరం నుంచి ప్రొద్దుటూరుకు తాగునీరు అందించేందుకు గతంలో కేంద్రం నిధులు ఇచ్చిందని సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ ఆ పనులు పూర్తి కాలేదని చెప్పారు. 175 నియోజకవర్గాల్లో ఒక పులివెందుల తప్ప మిగిలిన చోట్ల అభివృద్ధి లేదన్నారు. ఇరవై ఆరు నెలల్లో పోలవరం ప్రాజెక్టు మూడు శాతం పనులు కూడా జరగలేదన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులను తుంగలో తొక్కారని ఆదినారాయణ రెడ్డి ఆరోపించారు.
ఇదీ చదవండి:
'ఇదే పరిస్థితి కొనసాగితే.. రాష్ట్రంలో క్రీడాభివృద్దికి అవకాశం లేనట్టే'