వైఎస్ వివేకానందరెడ్డిని వాళ్లే చంపించి నాపై కేసులు పెట్టారని భాజపా నేత ఆదినారాయణరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూసే బాధ్యత అందరిపై ఉందని ఆదినారాయణరెడ్డి అన్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో భాజపా ఆధ్వర్యంలో చేపట్టిన 'రాయలసీమ రణభేరి'లో ఆయన ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి జగన్.. చేయాల్సిన పనులు చేయకుండా.. చేయకూడనివి చేస్తున్నారని మండిపడ్డారు. వివేకా హత్య కేసులో బయటకు వస్తున్న పేర్లన్నీ వారివే అని వైకాపా నేతలను ఉద్దేశించి ఆదినారాయణరెడ్డి వ్యాఖ్యానించారు. తెదేపా అధినేత చంద్రబాబు.. హత్యా రాజకీయాలు చేసే వ్యక్తి కాదని పేర్కొన్నారు.
ప్రాజెక్టుల పేరుతో ఎక్కడికక్కడ అవినీతి చేస్తున్నారు. వైకాపా పాలనలో కడప జిల్లాలో వచ్చిన ప్రాజెక్టులు ఏమిటి?. జమ్మలమడుగులో ఉక్కు పరిశ్రమ హామీ ఏమైంది?. రాయలు ఏలిన ప్రాంతంలో రాక్షస పాలన వచ్చింది. గండికోట, సోమశిల నిర్వాసితులకు పరిహారం ఇవ్వరా?. రాష్ట్రంలో రోడ్లు ఎక్కడ చూసినా గుంతలమయం. వైకాపా పాలనలో పరిశ్రమలు వరుసగా మూతపడుతున్నాయి. వైకాపా పాలనలో అన్ని వర్గాల ఉద్యోగులు ధర్నా చేస్తున్నారు. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోంది. - ఆదినారాయణరెడ్డి, భాజపా నేత
ఇదీ చదవండి: ఏపీ ప్రభుత్వం ఆర్థిక అవకతవకలకు పాల్పడింది: కేంద్ర ఆర్థిక శాఖ