Bikes Fired: వై.ఎస్.ఆర్.జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లె పట్టణంలో వరసగా మూడు రోజుల పాటు ఐదు వాహనాలు దహనం అయ్యాయి. అర్ధరాత్రి సమయంలో ఇళ్ల ముందు నిలిపిన ద్విచక్ర వాహనాలు, కార్లను ధ్వంసం చేసి... వాటికి నిప్పుపెట్టిన సంఘటనలు జరిగాయి. తెల్లవారుజామున యజమానులు బయటికి వచ్చి చూసుకుంటే... వాహనాలు తగలబడి పోయిన ఘటనలు కనిపించాయి. మూడు రోజుల నుంచి ప్రతిరోజూ ఏదో ఒక వీధిలోవాహనాలకు నిప్పు పెట్టిన ఘటనలు వెలుగు చూశాయి. నాలుగు రోజుల కిందట వేంపల్లె రామాలయం వీధిలో ఓ స్కూటీని తగలబెట్టారు. ఆ ఇంటికి ఎదురుగానే మరో స్కూటీకి నిప్పు పెట్టారు.
మూడు రోజుల కిందట మేదరవీధిలో రెండు ద్విచక్ర వాహనాలకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. కడప నుంచి బంధువుల ఇంటికి వేంపల్లెకు వచ్చిన ఓ మహిళ స్కూటీని బయట పెట్టగా తగలబెట్టారు. బుధవారం కూడా ఎస్బీఐ కాలనీలో కారును రాళ్లతో ధ్వంసం చేసి... నిప్పు పెట్టారు. పట్టణంలో జరిగిన వరస ఘటనలు అన్నీ కూడా అర్ధరాత్రి దాటిన తర్వాత 2 గంటల మధ్యలో జరుగుతున్న సంఘటనలేనని బాధితులు వాపోతున్నారు. అర్ధరాత్రి సమయంలో ఆకతాయిలు ద్విచక్ర వాహనాల్లో తిరుగుతూ ఇలాంటి ఘటనలు చేసి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలోని వేంపల్లెలో వరసగా మూడు రోజుల పాటు వాహనాలకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టి కాల్చి వేయడంపై పోలీసులు అప్రమత్తమయ్యారు. సీఎం నియోజకవర్గం కావడంతో ఉన్నతాధికారుల నుంచి పోలీసులకు చీవాట్లు వచ్చినట్లు సమాచారం. వేంపల్లెకు అదనపు బలగాలను రప్పించి... గురువారం రాత్రి నుంచి ముమ్మరంగా పులివెందుల డీఎస్పీ శ్రీనివాసులు ఆద్వర్యంలో గస్తీ నిర్వహించారు. అనుమానిత ప్రదేశాలను పరిశీలించారు.
అయితే పోలీసులు ఉన్నతాధికారుల ఒత్తిళ్లు తట్టుకోలేక ప్రాథమికంగా సంఘటనా స్థలంలో సంచరించిన మతి స్తిమితం లేని వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఇంకా ఈ ఘటనలో ఎవరి పాత్ర అయినా ఉంటుందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ తెలిపారు. గతంలో కూడా పులివెందుల, కడప నగరాల్లో ఆకతాయిలు వరసగా ఇళ్ల ముందు నిలిపిన వాహనాలకు నిప్పు పెట్టిన ఘటనలు వెలుగు చూశాయి. వేంపల్లె లో కూడా ఆకతాయిలే చేసి ఉంటారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
ఇవీ చదవండి: