Avinash Reddy files plea seeks court: వివేకా హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని ఇప్పటికే పలుమార్లు సీబీఐ విచారించింది. ఈ కేసును త్వరగా తేల్చాలంటూ సుప్రీం కోర్టు విచారణ సంస్థలను ఆదేశించిన నేపథ్యంలో విచారణ వేగవంతం చేసింది. సీబీఐ విచారణ కొనసాగుతుండగానే విచారణకు అడ్డంకులు సృష్టించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
ఆడియో, వీడియో రికార్డులు: వివేకా హత్య కేసులో తన విచారణకు సంబంధించిన ఆడియో, వీడియో రికార్డులను సమర్పించేలా సీబీఐని ఆదేశించాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి హైకోర్టును కోరారు. గత నెల 14న హైదరాబాద్‌లో సీబీఐ అధికారులు అవినాష్‌రెడ్డి విచారించారు. ఆ రోజు విచారణకు సంబంధించిన ఆడియో వీడియో రికార్డులు సమర్పించేలా సీబీఐని ఆదేశించాలని కోరారు. తన విచారణ ఆడియో, వీడియో రికార్డు చేయాలని గతంలో దాఖలు చేసిన పిటిషన్‌లోనే మధ్యంతర పిటిషన్ వేశారు.
అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డి పిటిషన్: మరోవైపు దస్తగిరిని అప్రూవర్‌గా అనుమతించడాన్ని సవాల్ చేస్తూ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డి వేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టేందుకు హైకోర్టు అంగీకరించింది. పిటిషన్‌కు నంబరు వేయాలని రిజిస్ట్రీని ఆదేశించిన హైకోర్టు.. ఇదే అభ్యర్థనతో వివేకా పీఏ కృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌లో కలిపి విచారణ చేపడతామని తెలిపింది. దస్తగిరికి కడప జిల్లా కోర్టు క్షమాభిక్ష ఇవ్వడాన్ని ఇద్దరూ సవాల్ చేశారు. సీబీఐ కుట్రపూరితంగా వ్యవహరించిందన్నారు. దస్తగిరి వాంగ్మూలంలో తన పేరు అనవసరంగా ప్రస్తావించారని భాస్కర్‌రెడ్డి పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇవాళ పిటిషన్‌పై వాదనలు విన్న హైకోర్టు.. తదుపరి విచారణను రేపు మధ్యాహ్నం రెండున్నరకు వాయిదా వేసింది. భాస్కర్‌రెడ్డి, కృష్ణారెడ్డి పిటిషన్లలో తన వాదనలు కూడా వినాలని వివేకా కుమార్తే సునీత ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలు చేశారు.
ఆలస్యమవుతున్న కేసు: ఇప్పటికే విచారణ ఆలస్యమవుతుందనే కారణంతో సీబీఐ అధికారి రామ్‌సింగ్‌ను తొలగించిన విషయం తెలిసిందే.. సిట్ బృందాన్ని ఏర్పాటు చేసింది. ఎస్పీ వికాస్ సింగ్, అడిషనల్ ఎస్పీ ముఖేశ్ కుమార్ సహా ఇన్‌స్పెక్టర్లు ఎస్.శ్రీమతి, నవీన్ పునియా, అంకిత్ యాదవ్ కొత్తగా ఏర్పాటైన సిట్ బృందంలో ఉన్నారు. ఇప్పటికే కొత్తగా ఏర్పాటైన సిట్.. సీబీఐ డీఐజీ కె.ఆర్.చౌరాసియా నేతృత్వంలో దర్యాప్తును కొనసాగిస్తుంది. ఈ కేసు దర్యాప్తు నుంచి సీబీఐ అధికారి రామ్‌సింగ్‌ను తప్పించింది. ఈ నేపథ్యంలో విచారణ వేగంగా కొనసాగుతుంది. కొత్తగా నియమితులైన అధికారులు ఇప్పటికే పలు అంశాలపై కేసుతో సంబందం ఉన్నవారిని విచారించి వారి నుంచి సమాచారం సేకరించే పనిలో పడ్డారు. విచారణకు సంబంధించిన ఆడియో, వీడియో రికార్డులను సమర్పించేలా సీబీఐని ఆదేశించాలని కోర్టును కోరడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇవీ చదవండి: