సర్పంచ్ ఎన్నికల్లో తెదేపా మద్దతుదారుడికి ఓటు వేసినందుకు తనపై వైకాపా నేతలు దాడి చేశారంటూ వల్లెపోగు రమేష్ అనే వ్యక్తి సోమవారం కడప జిల్లా రామాపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. రామాపురం మండలం హసనాపురం గ్రామం కట్టకింద హరిజనవాడకు చెందిన బాధితుడు రమేష్ గ్రామంలో జరిగిన రెండో విడత సర్పంచ్ ఎన్నికల్లో తెదేపా మద్దతిచ్చిన అభ్యర్థికి ఓటు వేశాడంటూ దాడికి పాల్పడ్డారు. గ్రామానికి చెందిన వైకాపా నాయకుడు పప్పిరెడ్డి మహేశ్వర్ రెడ్డి, ఆయన వర్గీయులు దాడి చేసి గాయపరిచారని బాధితుడు వాపోయాడు. గ్రామానికి వస్తే చంపేస్తామని బెదిరించడంతో ఊరు వదిలి వచ్చానని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదే గ్రామంలో నాలుగు రోజుల కిందట బీసీ కులానికి చెందిన ఓ వ్యక్తిపై తీవ్రంగా దాడి చేసి గాయపరిచారు. దళిత కులానికి చెందిన వ్యక్తిని నడిరోడ్డులో నిలబెట్టి దాడి చేయడం దారుణమని పీసీసీ మాజీ సభ్యుడు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆవేదన వ్యాక్తం చేశారు. సర్పంచ్ ఎన్నికల్లో తాను ముందుండి అభ్యర్థులను ఎన్నికల బరిలో నిలబెట్టానని జీర్ణించుకోలేని కొందరు అధికార పార్టీ నేతలు తమ వర్గీయులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని రాంప్రసాద్ రెడ్డి ఆరోపించారు. ఇక పై తన వర్గీయులపై దాడులు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని.. వాటిని దీటుగా ఎదుర్కొంటామన్నారు.
ఇదీ చదవండి: 'అధికార ధన దాహాన్ని తట్టుకొని భాజపా విజయకేతనం ఎగురవేసింది'