కడప జిల్లా రాయచోటిలో బ్రిటిష్ కాలం నాటి సహకార గృహ నిర్మాణ సంఘానికి 70 ఏళ్ల తర్వాత తొలిసారి ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఒకవైపు ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి మద్దతుదారులు పోటీలో నిలవగా.. మరోవైపు మాజీ ఎమ్మెల్యే, దివంగత నారాయణ రెడ్డి కుమారుడు రాహుల్ రెడ్డి బరిలోకి దిగారు. అధికారపక్షం నేతలు ఓటర్లను ప్రలోభపెట్టి అనుకూలంగా మార్చుకున్నారని ఒకరు ఆరోపిస్తుంటే... కొందరు ఓటర్లను.. ఓటింగ్‌కు రాకుండా రాహుల్‌రెడ్డి వర్గం అడ్డుకుంటుందని మరో వర్గం సభ్యులు ఎదురుదాడికి దిగారు. అధికార పక్షం ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓటు వేసే వారు 53 మంది కాగా వారిలో ఏడుగురు మృతి చెందారు. మిగిలిన 46 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 46 మంది ఓటర్ల కోసం ముగ్గురు సీఐలు, నలుగురు ఎస్సైలు, మరో 30 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయడం విశేషం. ఏడు డివిజన్లకు 12 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఎన్నికల ఫలితాలను అధికారులు సాయంత్రం లెక్కించనున్నారు. ఈనెల ఆరో తేదీన ఎన్నికైన వారు ఛైర్మన్‌ను ఎన్నుకుంటారని ఎన్నికల అధికారి రాజగోపాల్ తెలిపారు.
ఇవీ చూడండి: