కడప జిల్లాలో ఆన్లైన్ ద్వారా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఎనిమిది మంది క్రికెట్ బుకీలను పోలీసులు అరెస్ట్ చేశారు. సహాయకులుగా పనిచేస్తున్న వారితో కలిపి మొత్తం 13 మందిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ. 8.35 లక్షల నగదు, 20 కేజీల గంజాయి, 5 చరవాణులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో ప్రధాన క్రికెట్ బుకీ హైదరాబాద్కు చెందిన షేక్ మహమ్మద్ ఇమ్రాన్ ఉన్నారు.
జిల్లా వ్యాప్తంగా బెట్టింగ్..
క్రికెట్ బుకీలు అందరినీ కడప ఎస్పీ అన్బురాజన్ జిల్లా పోలీసు కార్యాలయంలో మీడియా ఎదుట హాజరుపరిచారు. జిల్లా వ్యాప్తంగా ఆన్లైన్ ద్వారా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం అందిందని చెప్పారు. రాయచోటి, ప్రొద్దుటూరు, కడప చిన్న చౌక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రత్యేక పోలీస్ నిఘా ఏర్పాటు చేశామన్నారు.
హవాలా ద్వారా..
ఈ ఎనిమిది మంది బుకీల బ్యాంకు ఖాతాలను పరిశీలించగా రూ.60 లక్షల నగదు... హవాలా ద్వారా పంపిణీ చేసినట్లు తెలిసిందని చెప్పారు. డైమండ్ ఎక్సైజ్ ఆన్లైన్ యాప్ ద్వారా బుకీలు క్రికెట్ బెట్టింగ్ నగదు బదిలీ చేసేవారని వివరించారు. ఈ యాప్ ద్వారా దేశమంతటా బెట్టింగ్ నిర్వహిస్తున్నారన్నారు. ప్రధాన నిందితుల కోసం గాలిస్తున్నామని ఎస్పీ తెలిపారు.