YSRCP and TDP Flexis In West Godavari District: పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం - తణుకు రహదారిలో అధికార, ప్రతిపక్ష పార్టీలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీశాయి. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు రైతు పోరుబాట పేరిట పాదయాత్ర చేయనున్నారు. పాదయాత్ర చేసే ప్రాంతాలలో అధికార వైసీపీ, టీడీపీల ఫ్లెక్సీలు పోటాపోటీగా వెలిశాయి.
రైతు పోరుబాట పాదయాత్రలో భాగంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు.. పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. దీంతో చంద్రబాబు పాదయాత్ర చేసే మార్గంలో.. తెలుగుదేశం, వైఎస్సార్సీపీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాయి. ప్రస్తుతం ఇవి జిల్లాలో తీవ్ర చర్చకు దారి తీశాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో చంద్రబాబు నాయుడు.. ఇరగవరం నుంచి తణుకు వరకు పాదయాత్ర నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు స్వాగతం పలుకుతూ.. టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఫొటోలతో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.
మరోవైపు చంద్రబాబు యాత్రకు పోటీగా వైఎస్ఆర్సీపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పాటు.. పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఫోటోలతో.. 'మా నమ్మకం నువ్వే జగన్' అంటూ సంక్షేమ పథకాల్ని వివరిస్తూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.
పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం - తణుకు రహదారిలో అధికార, ప్రతిపక్ష పార్టీలు రాత్రికి రాత్రే ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడంతో స్థానికంగా చర్చనీయాంశమైంది. చంద్రబాబు నాయుడు పర్యటన ఉందని.. అధికార వైసీపీ కావాలనే ఇలా రాత్రికి రాత్రి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిందని టీడీపీ కార్యకర్తలు విమర్శిస్తున్నారు.
చంద్రబాబు పోరుబాట ఎలా సాగనుందంటే?: అకాల వర్షాలకు దెబ్బతిన్న రైతుల తరఫున ప్రభుత్వంపై పోరుబాటకు టీడీపీ అధినేత చంద్రబాబు సిద్ధమయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో శుక్రవారం రైతులతో కలిసి చంద్రబాబు భారీ నిరసన కార్యక్రమం చేపట్టనున్నారు. రైతు పోరుబాట పేరిట అన్నదాతలతో కలిసి టీడీపీ అధినేత చంద్రబాబు ఇరగవరం నుంచి తణుకు వరకు 12 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్నారు.
శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పలు గ్రామాల మీదుగా చంద్రబాబు పాదయాత్ర సాగనుంది. వైసీపీ ప్రభుత్వ వైఫల్యంపై నిరసనగా భారీ స్థాయిలో ఈ పాదయాత్ర నిర్వహించనున్నారు. అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం ఇవ్వకపోవడం, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఈ పోరుబాట కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేయనున్నారు. వర్షాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా లక్షల ఎకరాల్లో ఉద్యాన, ఆహార, వాణిజ్య పంటలకు నష్టం వాటిల్లినట్లు తెలుగుదేశం వర్గాలు అంచనా వేశాయి.
ఇవీ చదవండి: