భారీ వర్షాల ధాటికి పశ్చిమగోదావరి జిల్లాలోని అనేక మండలాల్లో జనజీవనం అసవ్యస్తంగా మారింది. చింతలపూడికి చెందిన పలు గ్రామాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొన్ని చోట్ల చెట్లు విరిగి పడగా.. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. లింగపాలెంలో గుండేరు వంతెనపై వరదనీరు ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. టీ నరసాపురంలోని రహదారులు కోతకు గురయ్యాయి. ప్రభుత్వ ఆస్పత్రి, ఇతర కార్యాలయాలకు వెళ్లే మార్గంలో నీరు నిలిచిపోగా.. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పలు ప్రాంతాల్లో పంటలు నీటమునిగాయి. మద్యం మత్తులో చేపలు పడుతున్న ఓ వ్యక్తి.. కామవరపుకోట మండలం ఆడమిల్లిలో ప్రమాదవశాత్తు వరదలో గల్లంతయ్యాడని స్థానికులు తెలిపారు.
జీలుగుమిల్లి, బుట్టాయిగూడెం, వేలూరుపాడు, కుక్కునూరు, పోలవరం మండలాల్లో కురిసిన భారీ వానలకు.. ఏజెన్సీ ప్రాంతాల్లో వాగులు, కాలువలు పొంగి పొర్లుతున్నాయి. అలివేలు జల్లేరు జలాశయం నుంచి అధికారులు నీటిని విడుదల చేశారు. చెరువులకు గండ్లు పడి.. వరదనీరు రోడ్లపై పోటెత్తింది.
తణుకు, ఉండ్రాజవరాలలో ఆర్టీసీ డిపో ప్రాంగణాలు నీట మునిగాయి. దాదాపు మూడు అడుగుల మేర నీరు ప్రవహిస్తుండటంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ప్లాట్‌ఫాంపైకి వరద చేరడంతో.. కూర్చునేందుకూ అవకాశం లేకుండా పోయింది. అడుగున్నర పైగా వర్షపు నీటిలో ప్రధాన రహదారి మునిగిపోగా.. వేలాది వాహనదారులు అవస్థలు పడుతున్నారు.
ఇదీ చదవండి: గుర్రాలవాగు ఉద్ధృతికి కొట్టుకుపోయిన కల్వర్టు