విలేకరులమంటూ బియ్యం వ్యాపారిని బెదిరించి డబ్బు కాజేసిన ముగ్గురు యువకులను.. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు గ్రామీణ పోలీసులు అరెస్టు చేశారు. చింతలపూడి మండలం దేశవరానికి చెందిన మల్లెల్లి భాస్కరరావు, చింతలపూడికి చెందిన రాచూరి నవీన్, ధర్మాజీగూడేనికి చెందిన రాచూరి అశోక్‌లను అరెస్టు చేశామని.. ఏలూరు డీఎస్పీ దిలీప్ కిరణ్ తెలిపారు.
ఈ నెల 6న చింతలపూడి నుంచి తమిళనాడుకు.. బియ్యం లోడుతో వెళ్తున్న లారీని, ఏలూరు శివారు ఒంగూరు బైపాస్ వద్ద ఓ కారులో వచ్చిన ముగ్గురు యువకులు ఆపారన్నారు. తాము విలేకరులమని రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారని సమాచారం వచ్చిందని.. పత్రాలు చూపించాలని లారీలో ఉన్న యజమానిని అడిగారు. చింతలపూడి మెరకవీధికి చెందిన వ్యాపారి నూకల కోటేశ్వరరావు పత్రాలు చూపించగా.. అన్నీ సరైనవేనని చెప్పారన్నారు. అయినా ఆ యువకులు వినిపించుకోకుండా విజిలెన్సు అధికారులకు పట్టిస్తామని రూ.20 వేలు ఇస్తే వదిలేస్తామని బెదిరించారు. బియ్యం వ్యాపారి వద్ద రూ.5 వేలు లాక్కొని పరారయ్యారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. ఎస్‌ఐ చావా సురేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఏలూరు ఆశ్రం కూడలి వద్ద.. సోమవారం కారులో వెళ్తున్న వీరిని అరెస్టు చేశామని డీఎస్పీ తెలిపారు. 3 చరవాణులు, నంబర్ ప్లేట్ లేని కారు, రూ.1000 నగదును స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు.
ఇదీ చదవండి: నిలిచిన పనులకు ‘నిడా’ రుణం