Tanuku TDR Bonds Scam: పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పురపాలక సంఘంలో టీడీఆర్ బాండ్ల జారీలో చోటుచేసుకున్న అక్రమాలపై విచారణ జరిపిన ఏసీబీ పాత్రధారులను పట్టుకుని హడావుడి చేయడమే తప్ప అసలు సూత్రధారి ఎవరనేది మాత్రం తేల్చలేదు. అప్పట్లో పనిచేసిన మున్సిపల్ అధికారులను బాధ్యులుగా తేల్చేసి చేతులు దులిపేసుకుంది. ప్రజలు ఎన్నుకున్న పాలకవర్గం లేని సమయంలో వందల కోట్ల రూపాయల విలువ చేసే టీడీఆర్ బాండ్లను అధికార పార్టీకి చెందిన రాజకీయ బాస్ అనుమతి తీసుకోకుండా అధికారులే సొంతంగా జారీ చేసే ధైర్యం చేయగలరా అనే కోణంలో విచారించలేదు.
ఆ అదృశ్య శక్తి ఎవరు? : వివిధ రకాల అభివృద్ధి పనులు, సామాజిక అవసరాల కోసమంటూ పురపాలక సంఘం సేకరించిన భూమికి నిబంధనల ప్రకారం 1:2 నిష్పత్తిలో టీడీఆర్ బాండ్లు జారీ చేయాల్సి ఉండగా... 1:4 నిష్పత్తిలో జారీచేయడం వెనక ఎవరి ఒత్తిళ్లు ఉన్నాయి? తెర వెనక ఉండి అధికారులను నడిపించిన అదృశ్య శక్తి ఎవరు అనేది నిగ్గు తేల్చలేదు. నిబంధనలకు విరుద్ధంగా టీడీఆర్ బాండ్ల జారీ వల్ల అంతిమంగా లబ్ధి పొందింది ఎవరనే దిశగానూ దర్యాప్తు సాగించలేదు. ఈ మొత్తం వ్యవహారంలో సూత్రధారిగా చక్రం తిప్పారనే అభియోగాలు ఎదుర్కొంటున్న అధికార పార్టీ ప్రజాప్రతినిధి ప్రమేయం బయటకు రానీయకుండా మొక్కుబడిగా విచారణ సాగించి మమ అనిపించేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఏసీబీపై విమర్శలు : గతేడాది ఫిబ్రవరిలో ఈ కుంభకోణం బయటపడ్డ సమయంలో సాధారణ ప్రజాప్రతినిధిగా ఉన్న ఆ నాయకుడు తర్వాత కొన్ని రోజులకే రాష్ట్ర స్థాయిలో కీలక పదవి దక్కించుకున్నారు. అందుకే ఆయన ప్రస్తావన లేకుండా విచారణ తేల్చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 2 వేలు, 3 వేల రూపాయలు లంచాలు తీసుకుంటున్నారంటూ వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శులు వంటి చిన్నస్థాయి ప్రభుత్వ ఉద్యోగులపైకి దూసుకెళ్లే ఏసీబీ వందల కోట్ల రూపాయల కుంభకోణంలో సూత్రధారి ప్రమేయాన్ని బయట పెట్టకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
టీడీఆర్ బాండ్లు.. ముందడుగు వేయని ఏసీబీ : తణుకు-వీరభద్రాపురం రహదారిలో పట్టణానికి 1.4 కిలోమీటర్ల దూరంలో 20 ఎకరాల వ్యవసాయ భూమిని పచ్చదనం పెంపు కోసమంటూ తణుకు పురపాలక సంఘం రెండేళ్ల కిందట సేకరించింది. ఈ భూమి తణుకు, వేల్పూరు ప్రాంతాల రైతులది. పురపాలక సంఘమే నేరుగా రైతుల నుంచి భూమి సేకరించాలి. కానీ కొందరు మధ్యవర్తులు రైతుల నుంచి భూమిని కొనుక్కొని, వారి పేరిట రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. తర్వాత అదే వ్యవసాయ భూమిని గజాల రూపంలో పురపాలక సంఘానికి అప్పగించి ప్రతిగా టీడీఆర్ బాండ్లు పొందారు.
అప్పట్లో అక్కడ చదరపు గజం విలువ 4 నుంచి 5 వేల రూపాయలు ఉండగా, చదరపు గజానికి 22 వేల చొప్పున టీడీఆర్ బాండ్లు పొందారు. అధికార పార్టీకి చెందిన ఓ కీలక ప్రజాప్రతినిధి తన బినామీలతో భూములు కొనిపించి, తర్వాత వాటిని పురపాలక సంఘంతో సేకరింపజేసి, వాటి విలువకు మించి టీడీఆర్ బాండ్లు పొందారని, వాటిని అమ్ముకుని భారీగా సొమ్ము చేసుకున్నారన్నది ప్రధాన అభియోగం. ఆ అభియోగాల నిగ్గు తేల్చే దిశగా ఏసీబీ ఎలాంటి ముందడుగు వేయలేదు.
ప్రతిపక్షాలపై అనుమానాలు : తణుకు పురపాలక సంఘం 2018లో 4 వేల చదరపు గజాలు, 2019లో 600 చదరపు గజాల భూమిని సేకరించి టీడీఆర్ బాండ్లు జారీ చేసింది. అదే మున్సిపాలిటీ 2020 నుంచి 2021 జులై వరకు ఏకంగా 71 వేల 507 చదరపు గజాలు, 2021 ఆగస్టు నుంచి డిసెంబరు వరకు 32 వేల 871 చదరపు గజాల భూమిని సేకరించి, వాటికి టీడీఆర్ బాండ్లు ఇచ్చింది. మొత్తంగా వైకాపా అధికారంలోకి వచ్చాక లక్షా 4 వేల చదరపు గజాల భూమి సేకరించి వాటికి టీడీఆర్ బాండ్లు జారీ చేశారు. వీటి విలువ సుమారు 390 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా.
రెండేళ్లలోనే ఇంత పెద్ద ఎత్తున టీడీఆర్ బాండ్లు జారీ చేయడంపై ప్రతిపక్షాలు మొదటి నుంచీ అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. అదీ పురపాలక సంగానికి ఎన్నికైన పాలక వర్గం లేని సమయంలో ప్రత్యేకాధికారుల పాలనలో ఉండగా జారీ చేయడంపై సందేహాలు లేవనెత్తుతున్నాయి. అధికార పార్టీకి చెందిన కీలక ప్రజాప్రతినిధికి దీని ద్వారా అంతిమ లబ్ధి కలిగిందని ఆరోపిస్తున్నాయి. అయినా ఆ దిశగా ఏసీబీ సమగ్ర విచారణ జరపకపోవడం అనుమానాలకు బలం చేకూరుస్తోంది.
టీడీఆర్ బాండ్లు పొందిన వారెవరు? : తణుకు-వీరభద్రపురం రహదారిలో భూమి సేకరించాలని తణుకు పురపాలక సంఘం ఎప్పుడు నిర్ణయించిందనే ప్రశ్నకు సమాధానం అంతు చిక్కడం లేదు. ఆ నిర్ణయానికి ముందు, తర్వాత ఆ ప్రాంతంలో భూములు ఎవరి చేతుల్లో నుంచి ఎవరి చేతుల్లోకి మారాయన్నది తేలాల్సి ఉంది. ఆ భూములను పురపాలక సంఘానికి ఇచ్చి పరిహారంగా టీడీఆర్ బాండ్లు పొందిన వారెవరు? అంతిమంగా లబ్ధి చేకూరింది ఎవరికి అనే విషయాలు బహిర్గతం కావాల్సి ఉంది. ఇలాంటి అంశాలపై ఏసీబీ లోతుగా దృష్టి సారించలేదు.