Deaths in Jangareddygudem:పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో నాటుసారా తాగి పేదల ప్రాణాలు గాలిలో కలిసిపోవడం కలకలం రేగింది. సారా తాగిన వారిలో 15 మంది చనిపోయారని బాధిత కుటుంబాలు రోదిస్తున్నాయి. మృతుల్లో చాలా మందికి నాటు సారా తాగే అలవాటు ఉందని వారి కుటుంబసభ్యులు అంగీకరిస్తున్నారు. ఐతే.. గత రెండ్రోజుల్లోనే మరణాలు సంభవించాయని అంటున్నారు. అప్పటి వరకు బాగానే ఉన్నవారు సారా తాగి వచ్చాక నీరసం, విరేచనాలతో బాధపడ్డారని అంటున్నారు. వెంటనే ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. సారా కల్తీ కావడంతోనే తమవారు చనిపోయారని చికిత్స అందించిన వైద్యులు కూడా ఇదే విషయం తమతో చెప్పారని అంటున్నారు.
జంగారెడ్డిగూడెంలో నాటుసారా విక్రయాలను నియంత్రించడం లేదని మృతుల కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కూలిపనులకు వెళ్లే ఇంట్లోని మగవాళ్లు తక్కువ ధరకే వస్తుంది కదా అని సారా తాగుతున్నారని వాపోతున్నారు. జంగారెడ్డిగూడెం విషాదంపై అధికారులు వాదన వేరేలా ఉంది. కేవలం ముగ్గురే సారా కాటుకు బలయ్యారని చెప్తున్నారు. మిగిలిన వారు వివిధ అనారోగ్య సమస్యలతో మరణించారని చెబుతున్నారు.
వరుస మరణాలు దుమారం రేపడంతో అధికారులు స్థానికంగా సారా తయారీ స్థావరాలను ధ్వంసం చేశారు. బాధితులను ఎమ్మెల్యే ఎలీజా పరామర్శించారు. ఎక్కడి నుంచి సారా కల్తీ అయిందో పోలీసులు తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు.
ఇదీ చదవండి: Mysterious Deaths : జంగారెడ్డిగూడెంలో మిస్టరీ మరణాలు..కల్తీ సారే కారణమంటున్న బాధిత కుటుంబాలు