పశ్చిమ గోదావరి జిల్లా వేలేరుపాడు మండలంలో భారీ వర్షాలతో పొంగుతున్న వాగుల నేపథ్యంలో ప్రజల రాకపోకలకు అంతరాయం ఏర్పడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో అనారోగ్యంతో బాధపడుతున్న ఓ బాలింతను ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగు దాటించి 108 సిబ్బంది తమ సాహసాన్ని చాటుకున్నారు.
గిరిజన మహిళకు అపసోపాలు..
వేలూరుపాడు మండలం కుమ్మరిగూడేనికి చెందిన గిరిజన మహిళ కుంజా సుధారాణి సోమవారం సాయంత్రం వేలూరుపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రసవించింది. బాలింతకు రక్తం తక్కువగా ఉండటం వల్ల జంగారెడ్డిగూడెేనికి రిఫర్ చేశారు. జీలుగుమిల్లి అంబులెన్స్ సిబ్బంది బాలింతను తీసుకొచ్చేందుకు వెళ్లగా అదే మండలం రామవరం వద్ద చప్టాపై నుంచి వాగు ప్రవహిస్తుండటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
పైలెట్, యువకుల సాహసం..
అటువైపు నుంచి వేరే వాహనంలో బాలింతను తీసుకురాగా అంబులెన్స్ పైలెట్ పుల్లారావు, సిబ్బంది సూర్యప్రకాష్ సాహసానికి పూనుకుని స్ట్రెచర్‌తో అవతల వైపు వెళ్లి యువకుల సహాయంతో బాధితురాలిని వాగు దాటించారు. అనంతరం అంబులెన్స్లో ఎక్కించి జంగారెడ్డి గూడెం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లీ బిడ్డా క్షేమంగా ఉన్నారు.
ఇవీ చూడండి : రాష్ట్రంలో భారీ వర్షాలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక