కరోనా వైరస్‌ను పూర్తిగా నియంత్రించేందుకు ప్రభుత్వ యంత్రాంగం తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తోంది. పాజిటివ్ కేసులున్న ప్రాంతాలను రెడ్ జోన్లుగా గుర్తించి అక్కడ అన్ని విధాలా జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. జిల్లాలో మొత్తం 22 పాజిటివ్ కేసులు నమోదైన నేపథ్యంలో ఆయా ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రకటించారు. ఆయా ప్రాంతాల్లో అప్రమత్తంగా బందోబస్తు విధులు నిర్వహించాలని, ఆ ప్రాంతాలకు వెళ్లే రహదారులన్నీ దిగ్బంధనం చేయాలని ఎస్పీ నవదీప్ సింగ్... సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.
స్థానిక వన్‌టౌన్ కత్తేపువీధిలోని రెడ్‌జోన్ ప్రాంతాన్ని ఎస్పీ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రెడ్‌జోన్ ప్రాంతంలో నిత్యావసరాలు కొనుగోలుకు ప్రజలు వెళ్లేందుకు వీలుగా ఒక మార్గాన్ని ఏర్పాటు చేయాలన్నారు. నిబంధనలు మీరితే కఠినచర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. జిల్లాలో చట్టాలను అతిక్రమించిన వారిపై ఇప్పటివరకు 915 కేసులు నమోదు చేసి 4025 మందిని అరెస్టు చేశామన్నారు. 1193 వాహనాలను స్వాధీనం చేసుకున్నామని 11,677 మంది వాహనదారులకు రూ. 58,38,500 జరిమానా విధించామన్నారు.
జిల్లాలో మొత్తం 12 రెడ్ జోన్‌లు ఉన్నాయి. జిల్లా కేంద్రం ఏలూరులో నాలుగు, పెనుగొండలో రెండు, భీమవరం, ఆకివీడు, నరసాపురం, తాడేపల్లిగూడెం, ఉండి, భీమడోలుల్లో ఒక్కో ప్రాంతాన్ని రెడ్‌జోన్‌గా ప్రకటించారు.
జాగ్రత్తలు ఇవీ...
● కరోనా పాజిటివ్ కేసులున్న ప్రాంతాలన్నిటినీ రెడ్‌జోన్లుగా గుర్తించి అక్కడ హైఅలర్ట్ ప్రకటిస్తారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సిబ్బంది పర్యటించి ప్రజలకు అవగాహన కల్పిస్తారు. భౌతికదూరం పాటించేలా చూడటంతోపాటు అనుమానాస్పద కేసులను క్వారంటైన్‌లకు తరలిస్తారు.
● పాజిటివ్ కేసులున్న ప్రాంతం నుంచి 3 కిలోమీటర్ల మేర ప్రాంతాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుంటారు. ఆయా ప్రాంతాలకు సంబంధించి ఇతర ప్రాంతాలతో అనుసంధానం అయిన రహదారులను అన్ని వైపులా మూసివేస్తారు.
● ప్రజలు బయటకు వచ్చి, పోయే ప్రాంతంలో థర్మల్ స్క్రీనింగ్ చేస్తారు.
● పాజిటివ్ కేసు పేషెంట్లు ఎవరెవరిని కలిశారో ఆ వివరాలను 12 గంటలలోపే సేకరిస్తారు. ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలతో క్షేత్రస్థాయిలో నిరంతరం సర్వే చేయిస్తారు. ఈ ప్రాంతమంతా వైద్యుల పర్యవేక్షణ ఉంటుంది.
పెనుగొండ రెడ్‌జోన్‌లో సీఐ సునీల్‌కుమార్ ఆధ్వర్యంలో బందోబస్తు
పెనుగొండను రెడ్‌జోన్‌గా ప్రకటించినందున ఎవరూ ఇంటిని విడిచి ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రావొద్దని పెనుగొండ సీఐ పి.సునీల్‌కుమార్ తెలిపారు. లాక్‌డౌను అమలు తీరును శుక్రవారం పరిశీలించారు. నిత్యావసర వస్తువులు, మందులు కావాల్సిన వారు పంచాయతీలో ఏర్పాటు చేసిన కాల్‌సెంటర్‌కు (08819-246081) సమాచారం అందిస్తే ఇంటికి పంపిస్తామన్నారు.
ఇదీ చదవండి: