వరుణుడు శాంతించినా పశ్చిమగోదావరి జిల్లాలోని కొల్లేరు సరస్సులో మాత్రం నీటి మట్టం తగ్గడం లేదు. భారీ వర్షాలకు గతంలో ఎన్నడూ లేనివిధంగా 11.5వ కాంటూరు వరకు వచ్చి లక్షలాది ఎకరాలను ముంచింది. ఇప్పటికీ పరివాహక గ్రామాల ప్రజలను కంటిమీద కునుకు తీయనీయడం లేదు. కొల్లేరుకు కేంద్ర బిందువైన కృష్ణా జిల్లా కైకలూరు సబ్ డివిజన్ పరిధిలోని పెద్ద అడ్లగాడి వంతెన వద్ద 11.50 అడుగుల నీటిమట్టం నమోదైందని జలవనరుల శాఖ అధికారులు తాజాగా గుర్తించారు. శనివారం ఉదయానికి 11.15 అడుగులకు తగ్గింది. దాదాపు 8 రోజుల వ్యవధిలో కేవలం 0.35 అడుగులే తగ్గిందని అధికారులు తెలిపారు. ఇప్పటికే కొల్లేరు పరివాహక గ్రామాల ప్రజలు 14 రోజుల నుంచి ముంపు సమస్యలతో సతమతమవుతున్నారు. 50 ఏళ్లలో ఇలాంటి పరిస్థితి చూడలేదని రైతులు వాపోతున్నారు. నీటి ప్రవాహానికి ఎక్కడెక్కడ అవరోధాలు ఎదురవుతున్నాయనే అంశంపై అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తున్నారు.
62.30 టీఎంసీల నీరు
పదో కాంటూరు వరకు కొల్లేరులో నీటిమట్టాలను గుర్తిస్తారు. 1964లో నమోదైన వరదలు 954 చదరపు కిలోమీటర్ల పరిధిలో 2,35,738 ఎకరాల్లోని పంటలను ముంచేశాయి. అప్పట్లో 53.95 క్యూసెక్కుల నీరు కొల్లేరులోకి చేరింది. ఆ తర్వాత ఈ నెల 16న వచ్చిన వరదే రికార్డుగా నమోదైంది. ఇది 11.5 కాంటూరు పరిధిలోని 1,018 చ.కి.మీ. పరిధిలో 2,51,553 ఎకరాల పరిధిలోని పంటలు, ఆక్వా చెరువులతో పాటు పలు గ్రామాలు ముంపు బారిన పడ్డాయి. సుమారు 62.30 టీఎంసీల నీరు కొల్లేరులోకి చేరిందని అధికారులు చెబుతున్నారు. ఇదంతా ఉప్పుటేరులోకి చేరాలి. వర్షాలు తగ్గినా వరద ఆశించిన స్థాయిలో దిగడం లేదు. ఆక్రమణలతోపాటు కొల్లేరు, ఉప్పుటేరుల్లో మేటవేసిన కిక్కిస, మట్టికట్టలే ప్రధాన అవరోధాలుగా మారాయి. వరద మిగిల్చిన నష్టం చాలాకాలం తమను వెంటాడుతుందని పరివాహక ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
ఇక్కడే వరద పోటు
ఆకివీడు, నిడమర్రు, ఉంగుటూరు, భీమడోలు, దెందులూరు, పెదపాడు, ఏలూరు గ్రామీణ మండలాలు.. అయిదో కాంటూరు పరిధిలోని అన్ని గ్రామాలు పూర్తిగా ముంపునీటిలో చిక్కుకున్నాయి. కొల్లేరు పరిధిలోని సుమారు 32 గ్రామాలకు వరద ప్రభావం కనిపిస్తోంది.
అత్యవసర పనులకు కార్యాచరణ
వరదను బయటకు పంపేందుకు ఎదురవుతున్న అవరోధాలపై దృష్టి సారించాం. ప్రధానంగా ఉప్పుటేరు వంతెనకు సమీపంలోనూ రైల్వే వంతెనకు ఎగువన మేటవేసిన కిక్కిస తొలగింపు పనులకు ప్రతిపాదనలు తయారుచేస్తున్నాం. ఈ పనులు తక్షణం చేపట్టనున్నాం. రైల్వే వంతెన నిర్మాణ ప్రాంతంలో మేటవేసిన మట్టి అవరోధాలు తొలగించాలని గుర్తించాం. - టీ.అప్పారావు, డీఈ, మురుగునీటి పారుదల శాఖ
కొల్లేరు నీటిమట్టం ఇలా..
2.11.1916న 10.40 అడుగులు
11.11.1964న 10.70 అడుగులు
ఈ నెల 16న 11.50 అడుగులు
ఇవీ చదవండి..