పశ్చిమ గోదావరి జిల్లా మండల కేంద్రమైన ఉండ్రాజవరం గ్రామానికి ప్రత్యేకత ఉంది. ఆర్థికంగా సుసంపన్నమైన గ్రామాల్లో ఒకటిగా జాతీయస్థాయి గుర్తింపు పొందింది. ఈ గ్రామంలో వ్యవసాయం మీద ఆధారపడిన రైతులు అనుబంధంగా పాడి పశువులను పెంచేవారు. సుమారు అర్ధ శతాబ్దం క్రితం దేశంలో పౌల్ట్రీ వ్యవస్థ ప్రారంభమైన తొలినాళ్లలోనే వ్యవసాయ అనుబంధంగా ఈ గ్రామ రైతులు పౌల్ట్రీ ఫారాల ఏర్పాటు చేపట్టారు. తొలినాళ్లలో వందల సంఖ్యలో కోళ్లతో ప్రారంభమైన ఫారాలు లక్షల సంఖ్యకు చేరాయి.
జిల్లా వ్యాప్తంగా కోటి యాభై లక్షల కోళ్లు ఉండగా సుమారు 20 నుంచి 25 శాతం కోళ్లు ఈ గ్రామానికి చెందిన రైతులకు చెందినవే. ఉండ్రాజవరంలోనే కాక జిల్లాలోని లక్ష్మీపురం తదితర చోట్ల తూర్పుగోదావరి జిల్లాలోని కోరుకొండతోపాటు పలు ప్రాంతాల్లో ఈ గ్రామ రైతులు ఫారాలు ఏర్పాటు చేశారు. వ్యవసాయ అనుబంధ పరిశ్రమ కావడం వల్ల లాభదాయకంగా ఉంటుందని పౌల్ట్రీలను ఏర్పాటు చేసినట్లు రైతులు చెబుతారు.
పౌల్ట్రీ రంగంలో కోళ్లకు వాడే దాణా ముడిసరకులు వ్యవసాయ రంగంలో ఉత్పత్తి అవుతాయి. మొక్కజొన్న, సోయాబీన్ ఇతర గింజ రకాలు రైతులు పండించిన ఉత్పత్తులు అవడం వల్ల రెండు రంగాలకు ఉపయోగపడతాయని.. రైతులు భావించి సుమారు 1972 ప్రాంతంలోనే గ్రామంలో పౌల్ట్రీ ఫారాలు ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. తొలినాళ్లలో నేలపై నిర్మించిన పెంకుటి శాలలు, రేకుల షెడ్ లలో ఫారాలను ఏర్పాటు చేస్తే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కేసింగ్ ఫారాలను నిర్మించుకున్నారు.
కొద్ది కాలంగా పరిశ్రమలో ఇబ్బందులు తలెత్తుతున్నా మూడు నాలుగు దశాబ్దాల పాటు తాము అభివృద్ధి చెందడానికి పౌల్ట్రీ ఫారాలు ఎంతగానో దోహదం చేశాయని రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం రాయితీలు ఇచ్చి ఆదుకోవాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి: ఏపీ డెయిరీ ఆస్తుల వ్యవహారం: 'జీవో నెం.117 రాజ్యాంగ విరుద్దం'