Polavaram Project Authority Meeting: 2023 జూన్ కల్లా పోలవరం ప్రధాన డ్యాం పనులను గ్రౌండ్ లెవల్‌కు తెస్తామని జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్ కుమార్ తెలిపారు. హైదరాబాద్‌లోని కృష్ణా గోదావరి భవన్‌లో.. పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమావేశమైంది. పీపీఏ సీఈఓ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో జరిగిన ఈ భేటీలో కేంద్ర జలసంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి రెండు రాష్ట్రాల ఈఎన్‌సీలు, ఇంజినీర్లు హాజరయ్యారు. సమావేశంలో పోలవరం పనుల లక్ష్యాలు, వనరులపై చర్చించినట్లు తెలిపారు.
వర్కింగ్ సీజన్‌లో పనులకు ప్రణాళిక వేసి ఆమోదించినట్లు శశిభూషణ్ కుమార్ వెల్లడించారు. పోలవరం దిగువ కాఫర్ డ్యాం పనులు జనవరి నెల చివరికల్లా పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ప్రధాన డ్యాం పనుల ప్రారంభానికి డయాఫ్రమ్ వాల్‌ను పరీక్షిస్తామన్నారు. ప్రధాన డ్యాం గ్యాప్ పనులను 2023 డిసెంబర్‌కు పూర్తి చేస్తామని తెలిపారు. అన్నీ స్టడీ చేశాకే పోలవరానికి అనుమతులు వచ్చాయని.. ఉమ్మడి సర్వే చేయాలని ఎవరూ చెప్పలేదు, అంగీకరించలేదని తెలిపారు.
పోలవరంపై ఉమ్మడి అధ్యయనం ఏదీ ఉండదని స్పష్టం చేశారు. తెలంగాణ అభిప్రాయాలు ఇస్తే పరిశీలిస్తామని పీపీఏ చెప్పిందని పేర్కొన్నారు. రెండు సమావేశాలు జరిగినా ఇంకా ఏకాభిప్రాయం రాలేదన్నారు. భూసేకరణపైనా పీపీఏ సమావేశంలో చర్చ జరిగిందని.. రెండోదశలో మరో 30-40 వేల ఎకరాలు సేకరించాలని పేర్కొన్నారు. షెడ్యూల్ సిద్ధం చేసి భూసేకరణ ప్రక్రియ పూర్తి చేస్తామని వెల్లడించారు. పీపీఏ ఆఫీసును రాజమహేంద్రవరం తరలించాలని కోరుతున్నారని.. అక్కడ వసతి కోసం పరిశీలిస్తున్నామన్నారు.
పోలవరం ముంపు ప్రభావంపై ఉమ్మడి సర్వేకు ఏపీ అంగీకరించింది: పోలవరం ముంపు ప్రభావంపై ఉమ్మడి సర్వేకు ఏపీ అంగీకరించిందని తెలంగాణ రాష్ట్ర నీటిపారుదలశాఖ అధికారులు ప్రకటించారు. పోలవరం వల్ల రాష్ట్రంలో ముంపు ప్రభావంపై పీపీఏ సమావేశంలో ప్రస్తావించామని తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ తెలిపారు. ఇతర రాష్ట్రాలు కూడా కొన్ని అంశాలను ఇప్పటికే లేవనెత్తాయన్నారు. అన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర జలసంఘం అధ్యయనం చేయిస్తుందని మురళీధర్ స్పష్టం చేశారు. 892 ఎకరాలు ముంపునకు గురవుతాయని రాష్ట్ర ఇంజినీర్లు తేల్చారని పేర్కొన్నారు. ఉమ్మడి సర్వే తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని భేటీలో అధికారులు చెప్పినట్లు మురళీధర్‌రావు వెల్లడించారు.
ఇవీ చదవండి: