గోదావరి వరదతో పోలవరం ముంపు మండలాలు చిగురుటాకుల్లా వణికిపోతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం, వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లోని అనేక గ్రామాలు గోదావరి వరద తాకిడికి గురయ్యాయి. మొత్తంగా 42 గ్రామాలపై వరద ప్రభావం ఉంది. ఇందులో 2500 కుటుంబాలు భయంతో సురక్షిత ప్రాంతాలకు వెళ్లాయి. పోలవరం ప్రాజెక్టు కాపర్ డ్యాం వల్ల ముంపు గ్రామాల్లోకి నీరు చొచ్చుకొస్తోంది. ముందుజాగ్రత్తగా నిర్వాసిత గ్రామాలను అధికారులు ఖాళీ చేయాలని హెచ్చరించారు. కొన్ని గ్రామాల్లో ఎత్తైన ప్రాంతాలకు వెళ్లి ప్రజలు తాత్కాలిక పాకలు వేసుకొన్నారు. మరికొన్ని ప్రాంతాల్లో జనవాసాల్లోకి వచ్చి పాకలు వేసుకొన్నారు. కొందరైతే వరద గోదావరిలోనే చిక్కుకొని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పోలవరం మండలంలోని కొండ్రుకోట, తాటగుంట, కొరటూరు పంచాయతీల్లోని 19 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రహదారులపైకి వరద నీరు చేరింది. గోదావరి గట్టున ఉండే గ్రామాల్లోకి వరద చేరింది.
ముంపు మండలాల్లోని ప్రజలు సరైన సదుపాయాలు లేక దుర్భరమైన జీవనం సాగిస్తున్నారు. తాగడానికి సరైన మంచినీరు సైతం కరవైంది. నిత్యావసర సరకులు, కూరగాయలు, వైద్యం వంటివి అందడంలేదని బాధితులు చెబుతున్నారు. వేలేరుపాడు మండలం రేపాకుగొమ్మ, తాటకూరుగొమ్మ, తిరుమలాపురం, నార్లవరం, కటుకూరు, కోయిదా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సుమారు 15 గ్రామాల ప్రజలు నిత్యావసరాలు, కూరగాయల కోసం ఇబ్బందులు పడుతున్నారు. రహదారులపైకి వరద నీరు చేరడంతో సొంత ఖర్చుతో బోట్లద్వారా రాకపోకలు సాగిస్తున్నారు.
వరద వస్తోందంటూ గ్రామాలు ఖాళీ చేయమన్న అధికారులు..ఎలాంటి సదుపాయాలు కల్పించలేదని, కనీసం నిర్వాసితులవైపు కన్నెత్తి చూడలేదని చెబుతున్నారు. అవసరమైన పాకలు వేసుకోవడంలోను సహకరించలేదని..నిత్యావసరాలు కూడా తామే కొనుగోలు చేసుకున్నామని అంటున్నారు. తమకు పునరావాసం కల్పిస్తే గ్రామాలు ఖాళీ చేయడానికి సిద్ధంగా ఉన్నామంటున్న నిర్వాసితులు.. ఎలాంటి పరిహారం, పునరావాసం చూపకుండా ఊళ్లు విడిచివెళ్లమంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. గ్రామాలు ఖాళీ చేశాక పునరావాస ప్యాకేజీలు ఇవ్వకపోతే ఎవరిని అడగాలని నిలదీస్తున్నారు.
ఇదీ చదవండి:
olympics live: పీవీ సింధు విజయం.. రౌండ్-16కు అర్హత