తమిళనాడులో బాలికను అపహరించి రాష్ట్రానికి తీసుకువచ్చి, భిక్షాటన చేయిస్తున్న అదే రాష్ట్రానికి చెందిన వ్యక్తిని.. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏలూరులోని బాలికల సంరక్షణ కేంద్రానికి ఆ చిన్నారిని తరలించారు. ఈ బాలికనే కాక ఇంకా ఎవరైనా పిల్లలను కిడ్నాప్ చేసి బిక్షాటన చేయిస్తున్నారా అనే విషయంపై దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చైతన్య కృష్ణ వెల్లడించారు. ఆ చిన్నారి సమాచారాన్ని తమిళనాడులోని బాలికా సంరక్షణ కేంద్రానికి తెలియపరచి.. వారిద్వారా తల్లిదండ్రుల వద్దకు చేర్చేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు.
ఏడాది క్రితం..
మధురై జిల్లా సాతూర్కు చెందిన మేరీదాస్ అనే బాలికను.. అదే రాష్ట్రంలోని మధురై పట్టణానికి చెందిన సెల్వ అనే వ్యక్తి ఏడాది క్రితం కిడ్నాప్ చేసి రాష్ట్రానికి తీసుకువచ్చాడు. నాటి నుంచి తిరుపతి, రేణిగుంట, విజయవాడ, రాజమహేంద్రవరం, తాడేపల్లిగూడెం, నిడదవోలు తదితర ప్రాంతాల్లో భిక్షాటన చేయించాడు. నెల క్రితం తణుకు తీసుకొచ్చి గణేష్ చౌక్ సెంటర్లో భిక్షాటన చేయిస్తున్నాడు. ఈనెల 21న సరిగా యాచించడం లేదని మేరీదాస్ని తీవ్రంగా దండించాడు. బాలిక అక్కడి నుంచి తప్పించుకుని పాత బెల్లం మార్కెట్ వద్దకు చేరుకుని ఏడుస్తుండగా.. లారీ డ్రైవర్లు గుర్తించి పట్టణ పోలీసులకు అప్పగించారు. దర్యాప్తు చేసిన పోలీసులు.. చివరికి బాలికకు భిక్షాటన నుంచి విముక్తి కలిగించారు.
ఇదీ చదవండి: