Varahi Vijaya Yatra in Bhimavaram : అధికారం, డబ్బు బలంతో సంపన్నులు డబ్బులేని వారిని దోచుకునే పెత్తందారీ విధానాన్ని సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నెలలోనే చూపించారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. విధానాలపై మాట్లాడుతున్న తనపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ వ్యక్తిగత బాగోతం చెప్పడం మొదలుపెడితే సీఎంకు చెవుల్లో నుంచి రక్తం కారుతుందంటూ భీమవరం వారాహి విజయయాత్ర సభలో పవన్ మండిపడ్డారు.
జగన్ క్లాస్ వార్.. పవన్ క్లాస్ : పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో చేపట్టిన వారాహి విజయయాత్ర సభలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిను లక్ష్యంగా జనసేనాని పవన్ కల్యాణ్ నిప్పులు చెరిగారు. క్లాస్ వార్ అంటూ మాట్లాడుతున్న జగన్ అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే భవన నిర్మాణ కార్మికులు, ఇసుక రీచ్‌లు నిర్వహించే వేలాది మంది పొట్టకొట్టారని విమర్శించారు. క్లాస్ వార్ గురించి మాట్లాడే హక్కు జగన్‌కు లేదని విరుచుకుపడ్డారు.
ప్రజల డబ్బుతో సీఎం సోకు : పార్టీ పేరుకు కూడా న్యాయం చేయలేని వ్యక్తి జగన్ అని పవన్ మండిపడ్డారు. యువత, శ్రామికులు, రైతుల్ని కోలుకోలేకుండా దెబ్బ కొట్టారని విమర్శించారు. 'అంబేడ్కర్ విదేశీ విద్య' వంటి పథకాలకు పేర్లు మార్చి జగన్ తన పేరు పెట్టుకోవడాన్ని పవన్ తప్పుపట్టారు. ప్రజల డబ్బుతో సీఎం సోకులేంటని ప్రశ్నించారు.
పవన్ అభ్యర్థన : ప్రజలు భారీ మెజార్టీతో అధికారం అప్పగిస్తే గంజాయిని రాష్ట్ర పంటగా, గొడ్డలిని రాష్ట్ర ఆయుధంగా మార్చడం తప్ప జగన్ సాధించిందేమీ లేదని పవన్ ఆక్షేపించారు. పాతికేళ్ల పాటు ప్రజల కోసం కూలీలా పని చేయడానికే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేనను గెలిపించి అసెంబ్లీలో సత్తా చాటే అవకాశం ఇవ్వాలని పవన్ అభ్యర్థించారు.
మీ చిట్టా లాగితే చెవుల్లోంచి రక్తమే : ప్రజా సమస్యలు, విధానాలపై మాట్లాడుతుంటే సీఎం జగన్ సహా వైఎస్సార్సీపీ నాయకులు వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ వ్యక్తిగత బాగోతమంతా తెలుసన్న ఆయన చెప్పడం మొదలు పెడితే ఆయనకు చెవుల్లో నుంచి రక్తం కారుతుందని హెచ్చరించారు.
ఏ ప్రభుత్వం మద్యపాన నిషేదం చేయలేదు : మద్యపాన నిషేధం చేస్తామని అధికారంలోకి వచ్చాక లక్ష కోట్ల రూపాయలు దోచుకున్నారని సీఎం జగన్‌పై పవన్ ఆరోపణలు చేశారు. సంపూర్ణ మద్యపాన నిషేధం ఏ ప్రభుత్వానికేైనా సాధ్యం కాదన్నారు. తాము అధికారంలోకి వస్తే పాత ధరలను పునరుద్ధరిస్తామన్నారు. అలాగే మహిళలు మద్యం దుకాణాలు వద్దన్న చోట సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చారు.
'నేను ప్రభుత్వ పాలసీల గురించి మాట్లాడుతున్నా. జగన్ నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతున్నారు. జగన్‌రెడ్డి చెవులు రిక్కించి విను.. నీ జీవితంలో అణువణువూ నాకు తెలుసు. నీ వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవాలంటే ఓ వ్యక్తిని నా వద్దకు పంపు. ఆ విషయాలు వింటే చెవుల్లోంచి రక్తం వస్తుంది.'-పవన్‌కల్యాణ్, జనసేన అధినేత