రక్షిత మంచినీటిని ప్రజలకు నిరంతరం అందించాల్సిన బాధ్యత చట్టపరంగా పంచాయతీలపై ఉందని జల జీవన్ మిషన్ గుర్తుచేస్తోంది. ఇదే సమయంలో సరఫరా అవుతున్న తాగునీటి నాణ్యతపై ప్రజల్లో నమ్మకాన్ని కల్పించాలని తెలియజేస్తోంది. ఈ పథకాన్ని గతేడాది అక్టోబరు 2న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి భాగస్వామ్యంతో చేపట్టారు. జిల్లా నమూనా ప్రాజెక్టుగా తొలి ఏడాదే ఎంపికైంది.
నిలిచిపోయిన రూ.385 కోట్ల పనులు..
2024 నాటికి నూరు శాతం లక్ష్యాన్ని సాధించాలని నిర్ణయించారు. పథకం కింద మారుమూల పల్లెల్లో చిట్టచివరి గృహానికి కూడా పైపులైను ఏర్పాటు చేసి కుళాయి ద్వారా నీరందించాలి. తాగునీటి వనరులు దీర్ఘకాలం అందుబాటులో ఉండేలా అవసరమైన చర్యలు చేపట్టాలి. దీనికోసం జిల్లా వ్యాప్తంగా రూ.400 కోట్లతో పైపులైను విస్తరణ పనులు చేపట్టాలని ప్రతిపాదించారు. వీటిలో రూ.384 కోట్ల విలువైన పనులు టెండరు ద్వారా చేపట్టాల్సి ఉంది. విధి విధానాలు ఖరారు కాకపోవడంతో టెండర్ల ప్రక్రియ పట్టాలెక్కడం లేదు. మరోపక్క పైపులైన్ల విస్తరణ పనులు పూర్తికాకుండానే ‘అడగడమే తరువాయి’ అన్నట్లు కొత్త కుళాయి కనెక్షన్లు మంజూరు చేసేందుకు పంచాయతీలు పోటీ పడుతున్నాయి. దీనివల్ల వచ్చే వేసవిలో మంచినీటి సరఫరాపై ప్రభావం పడే అవకాశాలు ఉంటాయనే ఆందోళన వ్యక్తమవుతోంది.
ఇదీ లెక్క..
ఒక వ్యక్తికి రోజు వారీ అవసరాల కోసం కుళాయి ద్వారా సరఫరా చేయాల్సిన నీటి పరిమాణం ఇలా..
త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు..
‘జలజీవన్ మిషన్‌లో ఎంపిక చేసిన నామినేషన్ పనులను త్వరితగతిన పూర్తి చేసేలా దృష్టి సారించాం. ఇలాంటి పనులు జిల్లాలో దాదాపు 800 ఉన్నాయి. నిర్దేశిత గడువులోగా పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం. రూ.5 లక్షలకు పైబడిన పనులకు టెండర్లు పిలిచేందుకు విధి విధానాలు రావాలి. అవి వచ్చిన వెంటనే టెండర్ల ప్రక్రియ చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నాం’ -జేవీ రాఘవులు, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ
ఇదీ చదవండి: తాగునీటి సమస్య తీర్చాడని.. గుర్రంపై ఎమ్మెల్యే ఊరేగింపు...