రోడ్లు బాగు చేయమని అడిగిన ప్రజలను లాఠీలతో కొట్టి.. అరెస్ట్ చేయడమేమిటని జనసేన పార్టీ పీఏసి ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. పశ్చిమగోదావరి జిల్లా అడవికొలను గ్రామస్థులు తమ ఊరి రోడ్డు బాగు చేయమని అడగటమే నేరమన్న విధంగా ప్రభుత్వం వ్యవహరించడం దురదృష్టకరమన్నారు. తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు పాదయాత్ర చేస్తుంటే వైకాపా ప్రభుత్వం ఎందుకు ఉలిక్కిపడుతోందని నిలదీశారు. ప్రజలు ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే పోలీసులను ప్రయోగిస్తున్నారని దుయ్యబట్టారు.
రాష్ట్రవ్యాప్తంగా గుంతల మధ్యే రోడ్లు ఉన్నాయని నాదెండ్ల మనోహర్ ఎద్దేవా చేశారు. అడవికొలను గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జనసేన మద్దతుతో సర్పంచ్ గెలవడంతో.. వైకాపా అక్కసుతో రోడ్డు కోసం పాదయాత్ర చేసిన ప్రజలపై లాఠీచార్జి చేయించి, అరెస్టులు చేయించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గి పని చేస్తున్న పోలీసులు ఖచ్చితంగా చట్టం ముందు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. పలువురు జనసేన నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించారని.. వీరికి పార్టీ అండగా నిలుస్తుందన్నారు. తమ సమస్యలను చెప్పుకుంటున్న ప్రజలను భయపెడుతున్న వైకాపాది ప్రజాస్వామ్య ప్రభుత్వం కాదని అన్నారు. ఇలాంటి అప్రజాస్వామిక చర్యలకు వైకాపా కచ్చితంగా ప్రజాక్షేత్రంలో సమాధానం చెప్పుకొనే రోజులు రానున్నాయని నాదెండ్ల మనోహర్ హెచ్చరించారు.
ఇదీ చదవండి: