పశ్చిమగోదావరిలో నాలుగో విడత పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా సాగుతున్నట్లు అధికారులు తెలిపారు.
గోపాలపురం నియోజకవర్గం నల్లజర్ల, ద్వారకా తిరుమల మండలాల్లో చివరి దశ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ద్వారకాతిరుమల మండలంలో 28 పంచాయతీలకు ఒక పంచాయతీ ఏకగ్రీవం కాగా.. 27 పంచాయతీలకు.. అలాగే నల్లజర్ల మండలంలోని 24 పంచాయతీలకు ఒక పంచాయతీ ఏకగ్రీవం కాగా 23 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
ఉంగుటూరు నియోజకవర్గంలో నాలుగో విడత పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. నియోజకవర్గంలో ఉంగుటూరు, భీమడోలు, నిడమర్రు, గణపవరం మండలాల పరిధిలో 81 పంచాయతీలు ఉన్నాయి. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం 17 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 64 పంచాయతీలలో ఎన్నికలు జరుగుతున్నాయి. నియోజకవర్గంలో 2,00,116 ఓటర్లు ఉన్నారు. వీరి కోసం 777 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్ మొదలైన మొదటి గంటలో 8.9 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
ఇదీ చదవండీ.. రాష్ట్రంలో తుది దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం