Pawan Kalyan Visits Untimely Rains Hit Farmers: తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో వర్షాలతో పంట నష్టపోయిన రైతులతో జనసేన కార్యాలయంలో పవన్‌క ల్యాణ్ ముఖాముఖి నిర్వహించాడు. రైతుల సమస్యలు వినేందుకు కార్యాలయం ప్రారంభించినట్లు పవన్ వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వ అసమర్థత వల్ల రైతుల ధాన్యం కల్లాల్లో ఉండిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు సకాలంలో ఖాతాల్లో డబ్బులు వేయట్లేదని పవన్ ఆరోపించారు. సకాలంలో కొనుగోలు చేయనందునే వర్షాలకు ధాన్యం తడిచిందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్ క్షేత్రస్థాయిలో వాస్తవ నివేదికలు పరిశీలించలేదని పవన్ కల్యాణ్ విమర్శించారు. ధాన్యం కొనుగోళ్ల కోసం ఆందోళనకు దిగిన రైతులపై కేసులు పెడుతున్నారని పవన్ మండిపడ్డారు. రైతులను వేధిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని పవన్ కల్యాణ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
అన్నపూర్ణగా ఖ్యాతిగాంచిన గోదావరి జిల్లాల్లో రైతన్న కన్నీరు పెడుతున్నారని.. వారిని ఆదుకోవాల్సి బాధ్యత ప్రభుత్వంపై ఉందని, పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చేతికొచ్చిన పంటను సకాలంలో సేకరించకపోవడం, వ్యవసాయ శాఖ మంత్రి త్రికరణశుద్ధిగా పని చేయకపోవడం, ముఖ్యమంత్రి క్షేత్ర స్థాయి పర్యటనకు రాకపోవడంతో పంట నష్టపోవాల్సి వచ్చిందని విమర్శించారు. సిబ్బందితో బలంగా పని చేయించకపోవడం వల్లే ధాన్యం రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆరోపించారు. రైతులు రుణ మాఫీ అవసరం లేదని అంటున్నారని, పావలా వడ్డీతో ప్రతి సీజన్లోనూ పాతిక వేలు రుణం ఇప్పించామంటున్నారని పవన్ చెప్పారు. అధికార పక్ష నాయకులు, పోలీసులు రైతుల్ని వేధించినా, కేసులు పెట్టి హింసించినా తీవ్ర పరిణామాలు ఉంటాయని పవన్ హెచ్చరించారు.
రెండు రోజులు పర్యటన: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పవన్ రెండు రోజులు పర్యటించారు. వర్షాలకు దెబ్బతిన్న ధాన్యాన్ని పరిశీలించారు.. నష్టపోయిన రైతులతో మాట్లాడారు. ప్రభుత్వం సకాలంలో ధాన్యం కొనుగోలు చేయకపోవడంవల్ల వర్షాలకు ధాన్యం తడిపోయిందనిదని, దీంతో తమకు మరింత నష్టం వచ్చిందని పవన్ వద్ద కడియం ఆవ రైతులు గోడు వెళ్లబోసుకున్నారు. కడియం నుంచి కోనసీమలోని కొత్తపేట, పి.గన్నవరం నియోజకవర్గాల్లో పవన్ పర్యటించారు. మందపల్లి నుంచి కొత్తపేట మండలం అవిడి వెళ్లే మార్గంలో జనం నీరాజనాలు పలికారు. దారి పొడవునా మహిళలు పూల వర్షం కురిపించారు. భారీగా తరలి వచ్చిన జనంతో రావులపాలెం-కొత్తపేట రహదారిపై ట్రాఫిక్ స్తంభించిపోయింది. రాత్రి ఏడు గంటల సమయంలో అవిడి చేరుకున్న పవన్ మీడియాతో మాట్లాడారు. ఆ తర్వాత పి.గన్నవరం మండలం రాజులపాలెం చేరుకొని స్థానికులకు అభివాదం చేశారు. బుధవారం రాత్రి రాజమహేంద్రవరంలో పవన్ బస చేశారు. గురువారం ఉదయం రాజమహేంద్రవరంలోని జనసేన ప్రాంతీయ కార్యాలయంలో వర్షాలకు దెబ్బతిన్న రైతులతో పవన్ ముఖాముఖి నిర్వహించారు.
ఇవీ చదవండి: