రాష్ట్రంలో మద్యం ధరలు అధికంగా ఉండటంతో గుట్టుచప్పుడు కాకుండా తెలంగాణ మద్యం రాష్ట్ర సరిహద్దులు దాటుకుని ఏపీలోకి చేరుతుంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని ఆదర్శనగర్లో అక్రమంగా నిల్వ ఉంచిన తెలంగాణ మద్యాన్ని భీమవరం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 10 లక్షల 27వేల 50 రుపాయలు విలువ చేసే 1536 మద్యం సీసాలను, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో అక్రమంగా మద్యాన్ని తరలించిన తెలంగాణకు చెందిన మజ్జి నాగేశ్వరరావు, మిట్టల శివప్రసాద్, భీమవరం పరిసర ప్రాంతాలకు చెందిన పి.మావుళ్లు, దూడబోయిన బాలకృష్ణ, కట్టా వీరబాబు, గేదెల నర్సింహులును అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణలో కొనుగోలు చేసిన మద్యాన్ని భీమవరంలో విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా వచ్చిన సమాచారం మేరకు ఈ తనిఖీలు నిర్వహించామని అడిషనల్ ఎస్పీ కరీముల్లా షరీఫ్ తెలిపారు.
ఇవీ చదవండి