Husband Killed Wife: కట్టుకున్న భార్యని కంటికి రెప్పలా చూసుకోవలసిన భర్తే.. కాలయముడయ్యాడు. రోజూ తాగొచ్చి భార్య, పిల్లలను చిత్రహింసలు పెట్టేవాడు. ఇందులో భాగంగానే భార్యాభర్తల మధ్య జరిగిన ఘర్షణలో భార్యను కత్తితో దాడి చేసి అంతం చేశాడు. అనంతరం అతను కూడా గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రులిద్దరూ మృతి చెందడంతో పిల్లలు అనాథలయ్యారు.
ఇక అసలు వివరాల్లోకి వెళ్తే..
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం వీరంపాలెంలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి కట్టుకున్న భార్యను అతి కిరాతకంగా హత్య చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మద్యానికి బానిసైన గంజి దావీదు(35) తాగొచ్చి భార్య గంజి నిర్మల(30)తో తరచూ గొడవ పడేవాడు. ఈ క్రమంలో గురువారం అర్ధరాత్రి సమయంలో భార్యాభర్తలు ఘర్షణ పడ్డారు. ఇందులో భాగంగా ఘర్షణ ముదరడంతో దావీదు కత్తితో విచక్షణారహితంగా భార్య నిర్మలపై దాడి చేసి మెడ మీద, చేతుల మీద నరికాడు. గాయపడిన నిర్మల రక్తమోడుతూ సంఘటనాస్థలంలోనే మృతి చెందింది. స్థానికుల సమాచారం మేరకు రూరల్ పోలీసులు దావీదును అదుపులోకి తీసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.
గతంలో భార్య నిర్మల దుబాయిలో ఉందనే కోపంతో.. తన ఇద్దరు పిల్లల్ని రోజూ చిత్రహింసలకు గురి చేశాడు.. ఆమెను దుబాయ్ నుంచి రప్పించాలనే ఉద్దేశంతో రోజు తాగివచ్చి భార్యకు ఫోన్ చేసి పిల్లల్ని చిత్రిహింసలు పెట్టి.. ఆ వీడియోలను పంపించేవాడు. అప్పుడు ఆ ఘటన సోషల్ మీడియాలో వివాదం అయింది. ఇక ఆ బాధ భరించలేక నిర్మల దుబాయి నుండి ఇటీవలే అమ్మగారి ఇంటికి వచ్చింది.
మూడు రోజుల క్రితం తాను మరిపోయానని భార్య, పిల్లలని బ్రతిమాలి కొమ్ముగూడెంలో వాళ్ల అమ్మగారి ఇంటినుండి వీరంపాలెం తన ఇంటికి తీసుకొచ్చి దావీదు ఈ దారుణానికి పాల్పడ్డాడని.. అనంతరం దావీదు కూడా గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని డీఎస్పీ బండారు శ్రీనాథ్ వివరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
వీరంపాలెం గ్రామం నుంచి తెల్లవారు జామున గంజి నిర్మలను తన భర్త కత్తితో దాడి చేసి చంపేశాడని ఫోన్‌కాల్ రావడంతో మేము ఘటనా స్థలానికి వచ్చాము. అనంతరం హత్య జరిగిన ఇంటి పరిసరాలు పరిశీలించగా గంజి నిర్మల చనిపోయి ఉంది. అలాగే ఆమె మొహం, మెడ మీద, చేతుల మీద కత్తితో దాడి చేసిన గాయాలున్నాయి. మృతురాలి భర్త అయిన దావీదు తన భార్య దుబాయిలో ఉన్నప్పుడు డబ్బు పంపించడం లేదని..వ్యక్తిగతంగా తనని పట్టించుకోవడం లేదనే అనుమానంతో చంపేశాడు. గతంలో కూడా దావీదు తన పిల్లలను కొడుతూ ఆ వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ కాగా అతనిపై పెంటపాడు పోలీసు ఠాణాలో కేసు నమోదయింది. ప్రస్తుతం ఈ ఘటన మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాం.-ఎస్వీవీఎస్ మూర్తి, తాడేపల్లిగూడెం రూరల్ సీఐ
ఇవీ చదవండి :