రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు శంకుస్థాపనకే పరిమితమయ్యాయి. గతేడాది డిసెంబర్లో నవరత్నాలులో భాగంగా.. పేదలందరికీ ఇళ్లు, జగనన్న కాలనీల నిర్మాణానికి ప్రజాప్రతినిధులు శంకుస్థాపన చేశారు. వేగంగా కాలనీలు నిర్మించాలని ప్రభుత్వం చెబుతున్నా.. ప్రక్రియ ఇంకా ఊపందుకోలేదు. ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి భూసేకరణే తీవ్ర జాప్యం కాగా.. కాలనీలు నిర్మించడం మరింత ఆలస్యం అయ్యేలా ఉంది. ఇంజనీరింగ్ అధికారులు ప్రస్తుతం మ్యాపింగ్, జియో ట్యాగింగ్ చేస్తున్నారు.
ఆకాశాన్నంటిన ధరలు
పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు నియోజవర్గానికి 10,486 పక్కా గృహాలను ప్రభుత్వం మంజూరు చేసింది. ఒక్కో ఇల్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వం రూ.1.80 లక్షలు ఇస్తోంది. నిర్మాణాలపరంగా లబ్ధిదారులకు నాలుగు ఆప్షన్లు ఇచ్చారు. అందులో పూర్తిగా ప్రభుత్వం నిర్మించడం, లబ్ధిదారులు కట్టుకోవడం, మెటీరియల్ అందించడం వంటివి ఉన్నాయి. కట్టడాలకు ఇసుక ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉంగుటూరు మండలం చేబ్రోలులో ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు నియోజకవర్గంలో ప్రథమంగా ఇంటికి శంకుస్థాపన చేశారు. ఇక్కడ ఒక్క ఇల్లు నిర్మాణమూ చేపట్టకపోగా.. శిలాఫలకానికే పథకం పరిమితమైంది. మిగిలిన గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. స్థానిక ఎన్నికల ప్రభావం కాలనీల నిర్మాణంపై పడింది. సిమెంటు, ఇటుకలు, ఇనుము, ఇసుక ధరలు ఆకాశాన్నంటుతున్న సమయంలో.. లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణానికి ముందుకు రాని పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం తగిన ప్రోత్సాహం అందిస్తేనే గృహ నిర్మాణాలు పూర్తికావని ప్రజలు వాపోతున్నారు.
మొదలు కానీ బోర్ల పనులు
మండలాల వారీగా చూస్తే.. ఉంగుటూరుకి రూ.3.17 కోట్లు, భీమడోలుకి రూ. 2.93 కోట్లు, గణపవరానికి రూ.1.85 కోట్లను బోర్ల కోసం ప్రభుత్వం మంజూరు చేసింది. కానీ ఏ గ్రామంలోనూ బోర్లు వేయలేదు. అవి ఉంటేనే ఇళ్ల నిర్మాణానికి వీలు పడుతుంది.
మండలాల వారీగా మంజూరైన ఇళ్లు
మండలం | మంజురైన ఇళ్లు |
భీమడోలు | 3724 |
ఉంగుటూరు | 3614 |
గణపవరం | 1605 |
నిడమర్రు | 1543 |
ఇదీ చదవండి:
వీరవాసరం పీఎస్లో నగదు మాయం కేసు: ఇద్దరు కానిస్టేబుళ్లు అరెస్ట్