పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం గ్రామం వద్ద గోదావరి నది గట్టు సమీపంలో నిర్మించిన నెక్లెస్ బండ్ వరద ఉద్ధృతికి కొట్టుకుపోయింది. పాత పోలవరం గట్టుకు సైతం రంధ్రం పడటంతో నెక్లెస్ బండ్ నుంచి వచ్చే వరద నీరు గ్రామంలోకి ప్రవహించటంతో రహదారులన్నీ నీట మునిగాయి. పలు చోట్ల గట్లకు గండ్లు పడటంతో.. వాటిని పూడ్చేందుకు అధికారులు ప్రయత్నాలు మెుదలుపెట్టారు. వరదను నిలువరించేందుకు ఇసుక బస్తాలను అడ్డుగా వేస్తున్నా.. ప్రవాహం ఆగటం లేదు. దీంతో ఏ క్షణాన ఏం జరుగుతుందోనని 12 వేల జనాభా కలిగిన పాతపోలవరం ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
నెక్లెస్ బండ్ వద్ద ఏర్పడిన గండిని సకాలంలో పూడ్చకపోతే తీవ్ర నష్టాన్ని ఎదుర్కోవలసి ఉంటుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం వరదల కారణంగా ఇటువంటి పరిస్థితులు ఎదురవుతున్నా.. అధికారులు పట్టించుకోవటం లేదని ప్రజలు వాపోతున్నారు. కేవలం 10 లక్షల వ్యయంతో రింగ్ బండ్ ఏర్పాటు చేయాల్సి ఉన్నా.. అధికారుల నిర్లక్ష్యంతో తమకు ఇబ్బందులు తప్పటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గోదావరి నది వరద మరింత పెరిగి గట్టుకు ముప్పు ఏర్పడితే.. ప్రాణ నష్టం తప్పదని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
ఇదీ చదవండి: వశిష్టా గోదావరి వెంబడి ఉద్ధృతంగా వరద ప్రవాహం