పశ్చిమ గోదావరి జిల్లాలో...
తణుకులోని పవిత్ర గోస్తనీ నదీ తీరాన వేంచేసి ఉన్న కనకదుర్గమ్మ వారు ఈరోజు దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. భక్తులు కొవిడ్ నిబంధనలు పాటించే విధంగా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. మండలంలోని దువ్వ గ్రామంలో ఉన్న దానేశ్వరి అమ్మవారు దుర్గాదేవి అలంకారంలో దర్శనమిస్తున్నారు. మండపాకలో వేంచేసి ఉన్న ఎల్లారమ్మ అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు చివరి దశకు చేరుకున్నాయి.
తూర్పుగోదావరి జిల్లాలో...
అన్నవరం దేవస్థానంలో దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వన దుర్గ, కనక దుర్గ అమ్మవార్లు మహిషాసురమర్ధని అలంకరణలో భక్తులకు అభయప్రదానం చేస్తున్నారు. ఆలయ అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు.
విశాఖపట్నం జిల్లాలో...
విశాఖ శారదా పీఠంలో శరన్నవరాత్రి మహోత్సవాలు వేడుకగా సాగుతున్నాయి. ఈరోజు రాజశ్యామల అమ్మవారు... మహిషాసురమర్ధని అవతారంలో దర్శనమిచ్చారు. అమ్మవారి అవతారానికి పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి హారతులిచ్చారు.
నెల్లూరు జిల్లాలో...
సూళ్లూరుపేట శ్రీ చెంగాళ పరమేశ్వరి ఆలయంలో అమ్మవారు మహాలక్ష్మి అలంకారంలో దర్శనమిచ్చారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులు పూజలు చేశారు.
ఇదీచదవండి.