Loan app: ఆన్‌లైన్ యాప్ ద్వారా తీసుకున్న రుణం తిరిగి చెల్లించినా వేధింపులు ఆపకపోవడంతో తాతా, మనవడు ఆత్మహత్య చేసుకున్న ఘటన పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం లక్ష్మణేశ్వరంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, స్థానికుల కథనం ప్రకారం... లక్ష్మణేశ్వరానికి చెందిన భోగిరెడ్డి గిరిప్రసాద్ (26) ఎంబీఏ చదివి హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నారు. కొన్నిరోజుల కిందట ఆన్‌లైన్ యాప్‌లో కొంత నగదు రుణంగా తీసుకున్నారు. పలు దఫాలుగా చెల్లింపులతో తిరిగి తీర్చినా ఇంకా బాకీ ఉందని యాప్ నిర్వాహకులు చెప్పారు.
ఫోన్ చేసి వేధింపులకు గురి చేశారు. గిరిప్రసాద్ ఉద్యోగం చేస్తున్న సంస్థ వద్దకు యాప్ ప్రతినిధులు వెళ్లి గొడవపడ్డారు. ఆ సంస్థ యాజమాన్యం ఆయనను ఉద్యోగం నుంచి తొలగించింది. ఈ పరిస్థితుల్లో తండ్రి నాగరాజు గిరిప్రసాద్‌ను ఇంటికి తీసుకొచ్చారు. ఆ తర్వాతా యాప్ నిర్వాహకుల వేధింపులు తగ్గలేదు. మనస్తాపానికి గురైన గిరిప్రసాద్, తన తాత రాఘవరావుతో (73) కలిసి బుధవారం అర్ధరాత్రి పొలం వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
ఇవీ చదవండి: