కాలువలో అడుగంటిన నీరు పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం కొవ్వలి గ్రామ రైతులకు శాపంగా మారింది. పంట చివరి దశలో సాగు నీరు అందకపోవటంతో ఎండిపోతోంది. పచ్చగా ఉన్న పంట భూములు నెర్రలు ఏర్పడటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పెట్టిన పెట్టుబడైనా వస్తుందో రాదో అన్న సందిగ్ధంలో ఉన్న రైతు... పంట మీద ఆశ వదులుకోలేక చిన్న చిన్న కాలువల నుంచి ఇంజిన్ల సాయంతో నీటిని పొలానికి మళ్లిస్తున్నారు.
అసలే నీరు లేక అల్లాడుతున్న దెందులూరు రైతులకు.. చెక్పోస్ట్ సమీపంలో సాగునీటి కాలువలో ప్రవాహానికి అడ్డుగా 300 మీటర్ల మేర పేరుకు పోయిన గుర్రపు డెక్క తీవ్ర సమస్యగా మారింది.
ప్రస్తుతం ఒకటి నుంచి మూడ తడులు అందితే తప్ప పంట చేతికి రాదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పంట పొలాలకు కృష్ణా నీటిని అందజేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చినా ఇప్పటి వరకు నెరవేర్చలేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు, అధికారులు స్పందించి తమకు సాగు నీరు అందించాలని అన్నదాతలు వేడుకుంటున్నారు.
ఇదీ చదవండి: 'విదేశాల నుంచి వచ్చిన వారిని పర్యవేక్షిస్తున్నాం'