సాగు నీటికై రైతుల ఆందోళన..
నాగలి పట్టి పంట పండించాల్సిన రైతన్న పురుగు మందుల డబ్బా చేతబూని చావే శరణ్యమంటున్నాడు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం మోగల్లు గ్రామంలో గత నెల రోజులుగా సాగునీటి సరఫరా లేకపోవడం వల్ల రైతన్నలు రోడ్డుపై బైఠాయించి ఆందోళనలు చేపట్టారు. వరి సాగుకు సక్రమంగా నీరు అందించాలని ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోకపోవడం లేదని ఆరోపించారు. భీమవరం తణుకు రహదారిపై టెంట్ వేసి పురుగు మందుల డబ్బాలు చేతబూని ఆందోళన నిర్వహించారు.
అధికారులను నిలదీసిన రైతులు..
సాగుకు నీరు ఇవ్వండి.. రైతులను ఆదుకోండి అంటూ రైతులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జలవనరుల శాఖ ఏఈ అనిల్ తేజ, మండల వ్యవసాయ శాఖ అధికారి నారాయణరావులను నీటి విడుదలలో అధికారుల నిర్లక్ష్యంపై ప్రశ్నించారు. పూర్తిస్థాయిలో నీటిని విడుదల చేస్తామని జలవనరుల శాఖ డీఈ రవీంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో రైతులు ఆందోళన విరమించారు. ప్రతి ఏటా ఎదురవుతున్న.. సాగునీటి సమస్యను పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు.
ఇవీ చూడండి...