గిరిజన విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఏకలవ్య పాఠశాలలు ఆశలు రేపుతున్నాయి. పట్టణ ప్రాంతాల విద్యార్థులకు సైతం తీసిపోని రీతిలో చదువులో పోటీపడేలా సీబీఎస్‌ఈ సిలబస్, డిజిటల్ తరగతులు లాంటి అత్యున్నత ప్రమాణాలతో వాటిని ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రానికి 19 ఏకలవ్య పాఠశాలలు మంజూరు కాగా... వాటిలో 5 ఈ ఏడాది నుంచే ప్రారంభించారు. పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయగూడెం మండలం కె. బొత్తప్ప గూడెంలో ఏకలవ్య పాఠశాలకు 60 మంది బాలబాలికలు ఎంపికయ్యారు. సాధారణంగా గురుకుల పాఠశాలలను బాలురు, బాలికలకు వేర్వేరుగా నిర్వహిస్తారు. ఏకలవ్య పాఠశాలల్లో మాత్రం ఇద్దరికీ ప్రవేశం కల్పిస్తారు.
డిజిటల్ విధానంలో విద్యా బోధన
ప్రసిద్ధి పొందిన నవోదయ పాఠశాలలకు రెట్టింపు బడ్జెట్‌తో ఏర్పాటు చేస్తున్న ఏకలవ్య పాఠశాలల్లో... డిజిటల్, వర్చువల్ విధానాల్లో అత్యుత్తమ విద్యాబోధన సాగిస్తారు. మెరుగైన వసతులు, నాణ్యమైన పౌష్టి కాహారం అందిస్తారు. కేంద్ర ప్రభుత్వం నిధులు.. రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో ఈ పాఠశాలలు నడుస్తాయి. భవిష్యత్తులో ఎవరికీ తీసిపోని రీతిలో ఏకలవ్య పాఠశాలల విద్యార్థులు రాణిస్తారని ఉపాధ్యాయులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
వేధిస్తోన్న ఉపాధ్యాయుల కొరత
మొదటి సంవత్సరమే అయినందువల్ల ఈ పాఠశాలల్లో పలు సమస్యలను ఇంకా పరిష్కరించాల్సి ఉంది. ప్రస్తుతానికి తాత్కాలిక భవనాల్లోనే వీటిని ప్రారంభించారు. సీబీఎస్‌ఈ సిలబస్ బోధనకు తగిన ఉపాధ్యాయులు కరవయ్యారు. శాశ్వత ఉపాధ్యాయులను నియమించాల్సిన అవసరం ఉంది. ఆయా సమస్యల పరిష్కారంపై రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాల్సి ఉంది.
ఇవీ చదవండి: