పశ్చిమ గోదావరి జిల్లాలో గతంలో దాతలు స్థానిక సంస్థల కోసం ఆస్తులు దానం చేశారు. స్థానిక సంస్థల ఆర్థిక పరిపుష్టి కోసం ప్రభుత్వం సైతం ఆస్తులు కేటాయించింది. ఏలూరులో సెయింట్ జేవియర్ బాయిస్ కాన్వెంట్ సమీపంలో జిల్లా పరిషత్‌కు సంబంధించిన 7 క్వార్టర్లు ఉన్నాయి. క్వార్టర్లతో పాటు 3 వేల 874 చదరపు గజాల స్థలం కూడా ఉంది. ప్రస్తుతం మార్కెట్ ప్రకారం వీటి విలువ 20 కోట్ల రూపాయలు ఉంటుంది. ఈ క్వార్టర్స్‌ను రెవెన్యూ శాఖకు బదలాయిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఉత్తర్వులు జారీ చేశారు.
జిల్లా ఉన్నతాధికారులు, సిబ్బందికి నూతన నివాస భవనాలు నిర్మించాలన్న ఉద్దేశంతో ఈ ఆస్తులను రెవెన్యూ శాఖకు బదలాయిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జిల్లా పరిషత్ ఆస్తులను బదలాయించడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తుతాయని ప్రజాసంఘాల నాయకులు అంటున్నారు. ఇప్పటికే స్థానిక సంస్థలు బలహీనంగా మారాయని.. దీనికి తోడు ఉన్న ఆస్తులు తీసుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
ఏదైనా ప్రభుత్వ భూమిని ఇతర శాఖలకు మార్చే ముందు మంత్రి మండలి ఆమోదం తప్పనిసరి. మంత్రి మండలి ఆమోదంతో జిల్లా కలెక్టర్.. సదరు భూములు, ఆస్తులను బదలాయించే అధికారం ఉంది. నిబంధనలు పాటించకుండా జెడ్పీ ఆస్తులు బదలాయించారని ప్రజాసంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. సిబ్బందికి నూతన నివాస భవనాలు నిర్మించాలన్న సాకుతో విలువైన ఆస్తులను బదలాయిస్తున్నారని మండిపడుతున్నారు. ఈ నిర్ణయం మార్చుకోవాలన్న డిమాండ్ సైతం వినిపిస్తున్నారు.
ఇదీ చదవండి:
తెలుగు భాషపై చిన్నచూపు... ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయడమే: జీవీఎల్