పోలవరం విషయంలో మంత్రులే అబద్ధాలు చెబుతున్నారని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. పోలవరం నిర్వాసితుల తరఫున మేం ప్రశ్నిస్తున్నామన్న దేవినేని ఉమ... పోలవరం ఎత్తు విషయంలో అనేక అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. పోలవరం ఎత్తుపై పార్టీలు, రైతు సంఘాలు ఆందోళనగా ఉన్నాయని చెప్పారు. వైఎస్ హయాంలో మట్టి పనులు మాత్రమే పూర్తయ్యాయని ఉమ వివరించారు. కాంగ్రెస్ వైఖరితో పోలవరంపై రూ.2,537 కోట్ల అదనపు భారం పడిందన్నారు. పోలవరంపై ప్రధానికి లేఖ రాసి చేతులు దులుపుకున్నారని దేవినేని ఉమ ధ్వజమెత్తారు.
పోలవరం లెఫ్ట్ కెనాల్, పురుషోత్తపట్నం ఉండగా విశాఖకు పైప్‌లైన్లు కమీషన్ల కోసమేనని ఉమ ఆరోపించారు. హైదరాబాద్‌లో ఆస్తుల రక్షణకు, కేసుల మాఫీకి పోలవరంలో లాలూచీపడ్డారని తీవ్ర ఆరోపణలు చేశారు. పోలవరం ఎత్తును 45.72 నుంచి 41.15 మీటర్లకు తగ్గించాలని ఆలోచించారన్నారు. పోలవరానికి ఇప్పటివరకు రూ.16,673 కోట్లు ఖర్చయ్యాయన్న దేవినేని ఉమ... పోలవరానికి తెదేపా ప్రభుత్వమే రూ.11,735 కోట్లు ఖర్చు చేసిందని వివరించారు. ధైర్యం ఉంటే పోలవరం ఖర్చుపై వివరాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. కేసీఆర్‌తో లాలూచీ పడి సీలేరు, శబరిని తాకట్టు పెట్టే హక్కు జగన్‌కు లేదని స్పష్టం చేశారు.
ఇదీ చదవండీ... పోలవరం ఎత్తు అంగుళం కూడా తగ్గించడం లేదు: మంత్రి అనిల్