పశ్చిమగోదావరి జిల్లా తణుకులో వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో కరోనా బాధితుడు మృతి చెందాడు. స్థానిక పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన కొవిడ్ కేర్ సెంటర్కు నిడదవోలు మండలానికి చెందిన ఓ కరోనా బాధితుడిని మంగళవారం సాయంత్రం తీసుకొచ్చారు. తనకు అనారోగ్యంగా ఉందని బాధితుడు చెప్పినా వైద్య సిబ్బంది నుంచి ఎటువంటి స్పందన లేదని తెలుస్తోంది. ఆయాసంతో ఇబ్బంది పడిన బాధితుడు చివరికి తన గదిలోనే తుది శ్వాస విడిచాడు. రోగి చనిపోయినప్పటికీ గంటల తరబడి సంబంధిత సిబ్బంది స్పందించకపోవటంతో మిగిలిన రోగులు ఆందోళనకు దిగారు. సిబ్బంది నిర్లక్ష్యం వల్లే అతడు మృతి చెందినట్లు తోటి రోగులు చెబుతున్నారు.
కొవిడ్ కేర్ కేంద్రంలో సరైన వైద్య సదుపాయాలు అందుబాటులో లేవని.. వైద్య సిబ్బంది సైతం ఉండట్లేదని కొవిడ్ బాధితులు నిరసన వ్యక్తం చేశారు. సమయానికి భోజనం, మందులు అందించడం లేదని వారు వాపోయారు. తణుకులోని పాలిటెక్నిక్ కళాశాలను కొవిడ్ కేర్ కేంద్రంగా మార్చారు. అయితే ఇక్కడ సరైన వైద్య సదుపాయాలు ఉండటం లేదని గతం నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఇదీ చదవండి