Children have Achieved Records with Dance: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ వెస్ట్రన్, సినిమా డ్యాన్స్‌లు నేర్చుకుంటారే తప్ప.. సాంప్రదాయ నృత్యాలు నేర్చుకునేందుకు చాలా ఆలోచిస్తారు. అందుకు ఎంతో కష్టపడాలి.. ఎంతో సమయం పడుతుంది.. కానీ ఆ చిన్నారులు మాత్రం ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. అంతేకాదు వారు నేర్చుకున్న నృత్యంతో ఆ ఊరికే గుర్తింపు తీసుకొచ్చారు. ఒకే వేదికపై 106 మంది చిన్నారులు కూచిపూడి నృత్యం చేసి రికార్డ్ సాధించారు. వారిని ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణానికి చెందిన చిన్నారులు అరుదైన ఘనత సాధించారు. తమ నృత్య ప్రతిభతో వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాదించారు. తణుకు పట్టణానికి చెందిన శ్రీ పద్మజ నృత్య కళాక్షేత్రంలో శిక్షణ పొందిన 106 మంది చిన్నారులు ఒకే వేదికపై కూచిపూడి నృత్యాలు చేసి ప్రతిభను నిరూపించుకున్నారు. వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్ ప్రతినిధులు వీరి నృత్య ప్రతిభను గుర్తించి రికార్డు నమోదు చేశారు. రికార్డు ధ్రువీకరణ పత్రాన్ని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరావు చేతుల మీదుగా అకాడమీ నిర్వాహకులకు, చిన్నారులకు అందజేశారు.
అరుదైన ఘనత సాధించిన చిన్నారులను, వారికి తర్ఫీదునిచ్చిన వారిని మంత్రి అభినందించారు. ఈ రికార్డు నమోదుకావడం తణుకు పట్టణానికి గర్వకారణం అని మంత్రి పేర్కొన్నారు. చిన్నారుల ఉత్సాహం, తల్లిదండ్రుల ప్రోత్సాహం రికార్డు నమోదు కావడానికి దోహదం చేశాయని మంత్రి పేర్కొన్నారు. కళలకు పుట్టిల్లుగా తణుకు పేరును మరోసారి చిన్నారుల నృత్య ప్రతిభ ద్వారా నిరూపించారని మంత్రి కారుమూరి ఆనందం వ్యక్తం చేశారు.
ఈ చిన్నారుల ప్రతిభపై, వీరు సాధించిన వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్ పట్ల పలువురు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇటువంటి రికార్డులు సాధించడానికి కారణమైన.. వీరి తల్లిదండ్రులు, వీరికి శిక్షణ ఇచ్చిన గురువును ప్రశంసిస్తున్నారు. ఇలాంటివి రికార్డులు మరిన్ని సాధించాలని ఆకాంక్షిస్తున్నారు.
ఇవీ చదవండి: