పశ్చిమగోదావరి జిల్లాలో తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నియోజవర్గాల వారీ సమీక్ష చేపట్టారు. సమావేశం ప్రారంభానికి ముందే మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఇంటికి వెళ్లి పరామర్శించారు. వివిధ కేసుల్లో కస్టడీ ఎదుర్కొని బయటకు వచ్చినందున... ఆ వివరాలు తెలుసుకున్నారు. ఆ తర్వాత తణుకు చేరుకున్న చంద్రబాబుకు... నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. తొలుత ఏలూరు, గోపాలపురం, చింతలపూడి అసెంబ్లీ నియోజవర్గాలపై చంద్రబాబు సమీక్షలు నిర్వహించారు. పార్టీ స్థితిగతులు, పటిష్టతకు తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశంచేశారు.
పార్టీ సమీక్షల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ తీరుపై చంద్రబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో అపారంగా ఇసుక నిల్వలు ఉన్నా... ప్రభుత్వం కృత్తిమ కొరత సృష్టించిందని ఆరోపించారు. మన రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రాలకు తరలిపోతుండటం వెనుక ఎవరున్నారో అందరికీ తెలుసన్నారు.
తెలుగుదేశం నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. తెలుగు తమ్ముళ్లు ధైర్యంగా ఉండాలని.... ఇలాంటి కేసులకు భయపడవద్దని సూచించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. పథకాల అమలు కోసం భూములు అమ్మాలనుకుంటున్న ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరం పనులు ఆపడం దారుణమన్నారు.
ఇవీ చూడండి-వైకాపా చెప్పిన ధరల స్థిరీకరణ నిధి ఎక్కడ?: చంద్రబాబు