పోలవరం ప్రాజక్టుపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చుకు ఆడిట్ పూర్తి అయ్యేంత వరకు తాత్కాలిక ప్రాతిపదికనే నిధులు విడుదల చేస్తామని కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యుడు లేవనెత్తిన ప్రశ్నకు జలశక్తి శాఖ సహాయమంత్రి రతన్‌లాల్ కటారియా లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. తాత్కాలిక ప్రాతిపదికనే 1850 కోట్ల రూపాయల అదనపు నిధులు ఇవ్వడానికి జలశక్తి మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చిందన్నారు. గతంలో రాసిన లేఖల్లోని షరతులకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడితే తప్ప తదుపరి నిధులు విడుదల సాధ్యం కాదని ఆర్థికశాఖ నవంబర్ 26న రాసిన లేఖలో తేల్చి చెప్పిందని మంత్రి వివరించారు.
రూ. 6,764 కోట్లు ఇచ్చాం
2014 ఏప్రిల్1కి ముందు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చులకు సంబంధించి నిధులు మంజూరు చేయడం లేదన్న విషయం వాస్తవమేనా అన్న ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. 2014 నుంచి 2019 అక్టోబర్ వరకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం 11వేల 8వందల కోట్లు ఖర్చు చేసినట్లు ఏపీ ప్రభుత్వం సమాచారం ఇచ్చిందని కటారియా వెల్లడించారు. పీపీఏ, కేంద్ర జల సంఘం పరిశీలించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం క్లెయిమ్ చేసిన మొత్తాలను కేంద్రం ఎప్పటికప్పుడు తిరిగి చెల్లించిందని తెలిపారు. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తర్వాత 6, 764 కోట్ల రూపాయలు తిరిగి చెల్లించినట్లు వివరాలు బయటపెట్టారు. 2014 మార్చి 31 ముందు చేసిన ఖర్చుల వివరాలన్నీ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు అడుగుతూ వచ్చినట్లు తెలిపారు. 5,135 కోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొనగా... దానిలో 3, 777.44 కోట్లకు సంబంధించి హైదరాబాద్‌లోని ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ ఆడిట్ పూర్తి చేసినట్లు ఏపీ ప్రభుత్వం సమాచారం ఇచ్చిందన్నారు. గత నెల 8, 21, 27న రాసిన లేఖల్లో పలు షరతులు విధిస్తూ.. ఆర్థిక శాఖ చివరిగా నవంబర్ 26న లేఖ రాసిందని, ఆ షరతులకు లోబడి ఉంటేనే తదుపరి నిధులు విడుదల చేయడం సాధ్యమవుతుందని కేంద్రం రాజ్యసభ సాక్షిగా తేల్చి చెప్పింది.
ఇదీ చదవండి