పోలవరం ప్రాజెక్టులో ఇంకా ఎడమ, కుడి కాలువల పనులు, భూ సేకరణ మిగిలి ఉండగానే వాటికి నిధులు ఇవ్వబోమని కేంద్రం ఉత్తచేయి చూపుతోంది. పోలవరం ఎడమ కాలువలో ఇంకా 30% పైగా పనులు చేయాల్సి ఉంది. దాదాపు 5 ప్యాకేజీల్లో పనులు కొత్తవారికి అప్పచెప్పడమో, 60 సి కింద ప్రస్తుత గుత్తేదారుల స్థానంలో కొత్తవారిని నియమించడమో చేయాలి. ఇందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ పనులు పూర్తిచేసేందుకు ఇంకా రూ.వందల కోట్లు కావాలి.
కుడి కాలువలోనూ ఇంకా 2% పైగా పనులు చేయాలి. దాదాపు రూ.వంద కోట్ల లోపు అవసరం. ఈ రెండు విభాగాలకు ఇక నిధులిచ్చేది లేదని కేంద్రం తేల్చేసి బిల్లులు వెనక్కి పంపుతోంది. ఇంకా 50వేల ఎకరాలకు పైగా భూసేకరణ చేయాల్సి ఉండగా రూ.89 కోట్లు మాత్రమే ఈ విభాగంలో ఇవ్వాల్సి ఉంటుందని కేంద్రం మంజూరు చేసిన నిధుల ప్రకారం విశదమవుతోంది. 2013-14 లెక్కల ప్రకారం ఇక రూ.7,054 కోట్లు మాత్రమే ఇస్తామని గత ఏడాది అక్టోబరులో కేంద్ర ఆర్థికశాఖ ప్రకటించింది.
రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 2017-18 ధరల ప్రకారం రూ.47,725 కోట్లు ఇవ్వాల్సిందేనని అడుగుతోంది. ఈ లోపు విభాగాల వారీగా లెక్కలు చూస్తూ కాలువలు, తదితర అంశాల్లో నిధులు ఇచ్చేందుకు కేంద్రం అప్పుడే ఉత్తచేయి చూపుతుండటంతో పోలవరం నిధుల సమస్య తీవ్రమైనట్లే.
మేం చేసేదేమీ లేదు
2017-18 ధరలను సాంకేతిక సలహా కమిటీ, అంచనాల సవరణ కమిటీ కూడా ఆమోదించినందున సాంకేతికంగా తాము చేయగలిగింది ఏమీ లేదని అధికారులు చెబుతున్నారు. పోలవరం నిధుల విషయంలో ఇక రాజకీయ నిర్ణయమే కీలకమంటున్నారు. పోలవరానికి 2017-18 ధరల విషయంలో తగిన సమయంలో స్పందిస్తామని కేంద్ర జలవనరుల మంత్రి ఒక ఊరట మాట చెప్పినందున ఇక రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ ప్రయత్నాలతోనే ఆ నిధులు రాబట్టాలని అధికారులు అంటున్నారు.
తాగునీటి విభాగం ఖర్చు కలిపి లెక్కలు...
కేంద్ర ప్రభుత్వం 2013-14 అంచనాలు మొత్తం రూ.29,027.95 కోట్లకు పరిగణనలోకి తీసుకుని అందులో తాగునీటి విభాగం, విద్యుత్తు విభాగం కింద ఖర్చును తీసివేసి 20,398.61 కోట్లు మాత్రమే ఇస్తామంటోంది. రాష్ట్ర ప్రభుత్వం తాగునీటి విభాగాన్ని విడిగా చూడలేమని పోలవరం అథారిటీ సమావేశంలోనూ వాదించింది. ఆ విభాగం కింద ఖర్చును, విద్యుత్కేంద్రంలో పునాదులుగా తవ్వే మట్టిని ప్రధాన డ్యాంలో వినియోగించుకుంటున్నందున ఆ మొత్తం కలిపి రూ.25,390.61 కోట్లుగా లెక్కించి విభాగాల వారీగా పరిశీలిస్తే పై లెక్కలు తేలాయి. ఇలాంటి పరిస్థితుల్లోనూ ఇక వచ్చేది స్వల్పమే.
- పోలవరం ప్రాజెక్టులో ఇంకా 45.72 మీటర్ల స్థాయికి 50 వేల ఎకరాల వరకు భూమి సేకరించాల్సి ఉంది.
- లక్ష మందిని పైగా పునరావాసానికి తరలించాల్సి ఉంది
- పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తర్వాత ఇంతవరకు రూ.12,641 కోట్లు ఖర్చు చేస్తే కేంద్రం రూ.10,741.50 కోట్లు రాష్ట్రానికి ఇచ్చింది.
ఇదీ చదవండి: