AP Minister Kakani Govardhana Reddy fire on Pawan: జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన తూర్పుగోదావరి జిల్లా పర్యటనపై ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు. రాజానగరం మండలం లాలాచెరువులో సుమారు రూ.50 లక్షలతో నూతనంగా నిర్మించిన రైతు బజార్‌ను ప్రారంభించిన కాకాణి.. పవన్ కల్యాణ్ పర్యటన వల్ల ఒరిగేది ఏమీ ఉండదని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, రైతులు పది పంటలను చూపిస్తే అందులో ఐదు పంటలను గుర్తించలేని నారా లోకేశ్, పవన్ కల్యాణ్, నారా చంద్రబాబులు పర్యటనలు, పరామర్శలు చేసినంతా మాత్రాన రైతులు ఓట్లు వేయరంటూ ఎద్దేవా చేశారు.
కడియం, ఆవలో పవన్ పర్యటన.. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఈరోజు రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గం కడియంలో.. అకాల వర్షాలకు దెబ్బతిన్న వరి పంటను, ఆవలో నిల్వ చేసిన ధాన్యం రాశుల్ని పరిశీలించిన విషయం తెలిసిందే. అనంతరం రైతులతో మాట్లాడిన పవన్.. వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం లాలాచెరువులో నూతనంగా ఏర్పాటు చేసిన రైతు బజార్ ప్రారంభోత్సవానికి వ్యవసాయ శాఖ మంత్రి కె. గోవర్ధన్ రెడ్డి హాజరై, రైతు బజార్‌ను ప్రారంభించారు.
పవన్-లోకేశ్‌వీ పాప పరిహారపు యాత్రలు.. మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..''పవన్ కల్యాణ్ తిరిగితే తిరుగుతాడు.. అయితే ఏంటి..?. పవన్ కల్యాణ్ తిరిగినంతా మాత్రాన ఒరిగేది ఏమి ఉండదు.. పవన్ కల్యాణ్ ఎవరు..? పది పంటలు చూపిస్తే.. అందులో అయిదు పంటలను గుర్తుపట్టలేని వీళ్లు..(చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్) రైతుల గురించి, వ్యవసాయం గురించి మాట్లాడుతుంటే నవ్వాలో ఏడ్వాలో తెలియని పరిస్థితి. ఓట్ల కోసం రకరకాలుగా రైతులను ప్రలోభపెట్టాలనే ఆలోచనతోనే ముందుకెళ్తున్నారు. కానీ, రైతు అనేవాడు ఇటువంటి ప్రలోభాలకు గురికాడు. కాబట్టి వీళ్లు మాములుగా తీర్థయాత్రలు చేసినట్టుగానే పాప పరిహారపు యాత్రలు చేస్తున్నారే తప్ప.. ఇవీ ప్రజలకు సంబంధించినవి కావు'' అని ఆయన అన్నారు.
రైతుకు గిట్టుబాటు ధరను అందిస్తాం.. అనంతరం రైతు నష్టపోకుండా ఉండేందుకు వినియోగదారుల కోసం రాష్ట్ర ప్రభుత్వం.. రైతు బజార్లను ఏర్పాటు చేసిందని మంత్రి గోవర్ధన్ పేర్కొన్నారు. రాజానగరం మండలం లాలాచెరువులో రూ. 50 లక్షలతో 22 స్టాల్స్ ఏర్పాటు చేయడం ప్రజా ప్రతినిధులను, అధికారుల చర్యలు అభినందనీయమని ఆయన కొనియాడారు. రైతులు పండించిన ప్రతి పంట దళారుల ప్రమేయం లేకుండానే నేరుగా ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేస్తూ.. రైతుకు ఈ ప్రభుత్వం గిట్టుబాటు ధరను అందిచేందుకు కృషి చేస్తోందని ఆయన తెలిపారు.
ఇవీ చదవండి