కాబోయేవాడే కాలయముడయ్యాడు.. అనుమానంతో అగ్గిపెట్టాడు.. మరొకరితో చనువుగా మాట్లాడుతోందని పెళ్లిని రద్దు చేసుకున్నాడు. ఇరు కుటుంబాల మధ్య గొడవల నేపథ్యంలో విషయం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. పోలీసులు నచ్చజెప్పడంతో వివాహం చేసుకునేందుకు అంగీకరించాడు. ఈ క్రమంలో ఏం జరిగిందో తెలియదు కానీ నిన్న అర్థరాత్రి తర్వాత ద్విచక్ర వాహనం నుంచి పెట్రోల్ తీసుకొచ్చి యువతిపై చల్లి నిప్పంటించాడు. అడ్డుకోబోయిన యువతి అక్క, ఆమె కుమారుడికి.. గాయాలయ్యాయి. ఈ ఘటన విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం చౌడువాడలో జరిగింది. ముగ్గురినీ విజయనగరం జిల్లా ఆస్పత్రికి తరలించారు.
నిందితుడు నరవకు చెందిన రాంబాబుగా గుర్తించారు. రాంబాబు, ఆ యువతి కొన్ని రోజులుగా ప్రేమించుకుంటున్నారు. ఇరు కుటుంబాలు కూడా వీరి పెళ్లికి అంగీకరించాయి. అయితే ఇటీవల ఆ యువతి వేరే యువకుడితో మాట్లాడుతోందంటూ రాంబాబు పెళ్లి రద్దు చేసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. నిన్న రాత్రి రెండు కుటుంబాలను పిలిచి పోలీసులు రాజీ కుదిర్చారు. పోలీసుల సూచనతో వివాహం చేసుకునేందుకు యువకుడు అంగీకరించాడు. ఆ తర్వాత నిన్న అర్ధరాత్రి సమయంలో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అనంతరం ఆ గ్రామం నుంచి పరారయ్యాడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
సీఎం జగన్ ఆరా..
యువతిపై పెట్రోలు దాడి ఘటనపై ముఖ్యమంత్రి జగన్ ఆరా తీశారు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉండాలన్నారు. బాధితురాలికి అందుతున్న వైద్య సేవలను పర్యవేక్షించాలని సూచించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు.
బాధితురాలిని పరామర్శించిన మంత్రులు, అధికారులు..
సీఎం జగన్ ఆదేశాల మేరకు చౌడువాడ బాధితురాలిని మంత్రులు మంత్రులు పుష్పశ్రీవాణి, బొత్స సత్యనారాయణ పరామర్శించారు. అలాగే జిల్లా కలెక్టర్ సూర్యకుమారి, ఎస్పీ దీపికా పాటిల్ బాధితురాలిని పరామర్శించారు. హత్యాయత్నం చేసిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని ఎస్పీ దీపికా పాటిల్ తెలిపారు. వారం రోజుల్లో ఛార్జిషీట్ వేస్తామని.. బాధితురాలికి ఎలాంటి ప్రాణాపాయం లేదని వెల్లడించారు. మహిళల భద్రత విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని ఈ సందర్బంగా ఎస్పీ దీపికా పాటిల్ పేర్కొన్నారు.
కేజీహెచ్‌కు తరలింపు
విజయనగరం జిల్లా పెట్రోల్ దాడి బాధితులను కేజీహెచ్‌కు తరలించారు. మెరుగైన వైద్యం కోసం వారిని అధికారులు కేజీహెచ్‌కు తరలించారు.
ఇదీ చదవండి: Coronavirus India: దేశంలో 36 వేల కొత్త కేసులు.. 540 మరణాలు