విజయనగరం జిల్లా సాలూరు మండలం శివరాంపురం గ్రామానికి చెందిన పలువురికి రేషన్, పింఛన్ నిలిపివేయాలని స్థానిక తహసీల్దార్ శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు ఆవేదనకు గురువుతున్నారు. అధికారులు ఈ నిర్ణయం ఎందుకు తీసున్నారంటే..?
ఈ ఏడాది నవంబరులో అధికారుల పొరపాటు కారణంగా.. శివరాంపురం గ్రామస్థుల బ్యాంకు ఖాతాల్లో రైతు భరోసా పథకానికి సంబంధించిన నగదు జమ అయింది. మొత్తం 247మంది ఖాతాల్లో.. రూ.13,500 చొప్పున డబ్బులు జమయ్యాయి. ఈ విషయం గర్తించిన అధికారులు.. సదరు గ్రామస్తుల వద్దకు వెళ్లి విషయం తెలిపారు. ఆ డబ్బును తిరిగి వెనక్కి ఇవ్వాలని కోరారు. అయితే.. కొంతమంది మాత్రమే ఇచ్చారు.
ఈ విషయమై తహసిల్దార్ కోట శ్రీనివాసరావు గ్రామంలో పర్యటించి.. రైతులకు అవగాహన కల్పించారు. అయినప్పటికీ.. 59 మంది మాత్రమే డబ్బును తిరిగి చెల్లించారు. ఈ నేపథ్యంలో.. మిగిలిన వారిపై చర్యలకు అధికారులు ఉపక్రమించారు. ఇందులో భాగంగా.. రైతుభరోసా, వైఎస్సార్ ఆసరా, ఆరోగ్యశ్రీ, నవరత్నాలు పథకాలను నిలిపివేస్తున్నట్లు తహసీల్దార్ ఉత్తర్వులు జారీ చేశారు. డబ్బులు మొత్తం తిరిగి చెల్లిస్తే.. ప్రభుత్వ పథకాలు మళ్లీ పునరుద్ధరిస్తామని చెప్పారు.
దీనిపై శివరాంపురం గ్రామస్థులు స్పందిస్తూ.. పండగ సమయంలో తమ అకౌంట్లో డబ్బు జమ అయ్యిందని, అవి ఖర్చుపెట్టేశామని చెప్పారు. ఇప్పుడు ఉన్నట్టుండి ఒకే వాయిదాలో చెల్లించే స్థోమత లేదని అంటున్నారు. తుపాను బారి నుంచి పంటలు నష్టపోయి ఉన్నామని, వాయిదాల పద్ధతిలో చెల్లించే అవకాశం ఇవ్వాలని కోరారు. రేషన్ బియ్యం సహా.. ప్రభుత్వ పథకాలు ఆపేస్తే తీవ్ర ఇబ్బందులు పడతామని, అధికారులు ఈ విషయమై పునరాలోచించాలని కోరారు.
కలెక్టర్ స్పందన..రేషన్ పునరుద్ధరణ
రేషన్, పింఛను నిలిపివేతపై.. ఈటీవీ, ఈటీవీ-భారత్ రూపొందించిన కథనానికి కలెక్టర్ స్పందించారు. రేషన్ బియ్యం సహా.. ప్రభుత్వ పథకాలు ఆపేస్తే తీవ్ర ఇబ్బందులు పడతామన్న బాధితుల ఆవేదనపై సానుకూలంగా స్పందించిన జిల్లా పాలనాధికారి సూర్యకుమారి.. బియ్యం పంపిణీ చేయాలని ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలతో తహశీల్దార్ శ్రీనివాసరావు రేషన్ పంపిణీ చేపట్టారు.
ఇదీచదవండి.