జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వ శాఖలు సంయుక్త కమిటీగా ఏర్పడి రోడ్ల ఆడిట్ నిర్వహించి.. లోపాలను గుర్తించి, సరిచేయాలని విజయనగరం జిల్లా కలెక్టర్ హరిజవహర్ లాల్ ఆదేశించారు. పలు శాఖల అదికారులతో జిల్లా రహదారి భద్రత కమిటీ సమావేశం నిర్వహించారు.
కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గుంతలున్న రోడ్లు, ప్రమాదకర మలుపులు, వారపు సంతలు, విద్యాసంస్థలు ఉండే ప్రదేశాల్లో.. వాటిని గుర్తించేలా సైనేజ్ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. ప్రమాదాలకు ఆస్కారం వుండే ప్రదేశాలను, బ్లాక్ స్పాట్‌లను గుర్తించి ఆయా ప్రదేశాల్లో ప్రమాదాల నివారణకు ఎలాంటి చర్యలు చేపట్టాలనే అంశంపై ఒక కార్యాచరణ రూపొందించాలన్నారు.
పాఠశాల బస్సుల విషయంలో కఠినంగా ఉండండి
పాఠశాల బస్సుల తనిఖీలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలని కలెక్టర్ సూచించారు. బస్సుల కండిషన్ విషయంలో నిబంధనల మేరకు అన్ని ప్రమాణాలు ఉంటేనే సర్టిఫికెట్ ఇవ్వాలన్నారు. ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఎవరూ వాహనాలు నడపకుండా తనిఖీలు చేపట్టాలని.. లైసెన్స్ గడువు పూర్తయిన వారిని గుర్తించి రెన్యువల్ చేయించుకునేలా సూచనలు చేయాలని పేర్కొన్నారు.
ప్రతినెలా నివేదిక ఇవ్వండి
ప్రమాదాలకు గురైన వారికి తక్షణ చికిత్స అందించి వారి ప్రాణాలు కాపాడేందుకు వీలుగా జిల్లాలో ఒక ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు చేయాల్సి ఉందని కలెక్టర్ అన్నారు. అది ఎక్కడ ఏర్పాటు చేస్తే ఉపయోగంగా ఉంటుందో పరిశీలించాలని ఆయా అధికారులను ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల కారణంగా జరుగుతున్న మరణాలు తగ్గించే లక్ష్యంతో చర్యలు చేపట్టాలని సూచించారు. రోడ్డు భద్రత కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఎంతవరకు అమలవుతున్నాయనే అంశంపై ప్రతినెలా తనకు నివేదిక ఇవ్వాలని రవాణా శాఖ ఉప కమిషనర్ శ్రీదేవిని ఆదేశించారు.
ఇవీ చదవండి...