విశాఖపట్నంలో రాష్ట్ర కార్యనిర్వహక రాజధాని ఏర్పాటుపై సీఎం ప్రతిపాదన పట్ల ఉత్తరాంధ్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని విజయనగరం జిల్లా వైకాపా నేతలు పేర్కొన్నారు. విజయనగరంలోని గజపతినగరం శాసనసభ్యుడు బొత్స అప్పల నరసయ్య నివాసంలో సాలూరు, గజపతినగరం శాసనసభ్యులు రాజన్నదొర, బొత్స అప్పలనరసయ్య, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే రాజన్న దొర మాట్లాడుతూ... అభివృద్ధి కేవలం కృష్ణా, గుంటూరు జిల్లాలకే పరిమితం కావాలా అని ప్రశ్నించారు. శతాబ్దాలుగా వెనకబడిన విజయనగరం, శ్రీకాకుళం లాంటి జిల్లాల పరిస్థితి ఏంటని... ఈ ప్రాంతం అభివృద్ధి చెందటం ప్రతిపక్షనేతకు ఇష్టం లేనట్టుందని అన్నారు. గజపతినగరం ఎమ్మెల్యే బొత్స అప్పల నర్సయ్య మాట్లాడుతూ.... విశాఖను కార్యనిర్వహక రాజధానిగా ప్రతిపాదించటం సంతోషంగా ఉందని అన్నారు. జి.ఎన్.రావు కమిటీ నివేదికను యధావిధిగా అమలు చేయాలని ముఖ్యమంత్రిని కోరారు. మూడు రాజధానుల ఏర్పాటుతో అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ... వికేంద్రీకరణ వలన అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నారు. అమరావతి రైతులకు న్యాయం జరిగేలా ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటారని ఆయన అన్నారు.
ఇదీ చదవండి:సమరావతి: రాజధాని రైతుల జలదిగ్బంధం