మాన్సాస్ ట్రస్ట్ ఛైర్ పర్సన్ సంచయిత గజపతి వ్యవహరిస్తున్న తీరు ఉద్యోగులకు ఇబ్బందికరంగా మారిందని....ఈ వ్యవహరంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జోక్యం చేసుకోవాలని ట్రస్టు పూర్వ ఛైర్మన్ ఆనంద గజపతిరాజు కుమార్తె ఊర్మిళ గజపతిరాజు కోరారు. ఈ మేరకు లేఖ ద్వారా సీఎంకు విజ్ఞప్తి చేస్తున్నట్లు ఆమె తెలిపారు. జీతాల బకాయిలపై మాన్సాస్ ట్రస్టు పరిధిలోని మహారాజ కళాశాల బోధన, బోధనేతర సిబ్బంది ఆందోళనకు దిగటంపై ఊర్మిళ గజపతిరాజు విజయనగరంలోని తన బంగ్లాలో మీడియా సమావేశం నిర్వహించారు.
ట్రస్ట్‌కు చెందిన కళాశాల ఉద్యోగులకు ఎన్నో నెలలుగా జీతాలు రాకపోవటం బాధాకరమని ఊర్మిళ అన్నారు. ఈ విషయంపై విద్యార్థులు సైతం నిరసన వ్యక్తం చేశారు. మా తాతగారు పీవీజీ రాజు విగ్రహం వద్ద నిరసన తెలపటం మరింత బాధ కలిగిస్తోందన్నారు. సంచయిత గజపతి ఛైర్ పర్సన్‌గా వ్యవహరిస్తున్న సింహాచలం దేవస్థానం ఉద్యోగులకూ సకాలంలో జీతాలు అందటం లేదు. మాన్సాస్ ట్రస్టులో ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుందని ఊహించలేదని ఊర్మిళ చెప్పుకొచ్చారు. ట్రస్ట్ ఛైర్పర్సన్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న కారణంగా ఉద్యోగులు జీతాల కోసం ఆందోళనకు దిగాల్సి వచ్చిందని అన్నారు. ఉద్యోగులే కాకుండా.... ట్రస్టు పరిధిలోని విద్యాసంస్థల్లోని విద్యార్థులు నష్టపోయే చర్యలకు ఒడిగట్టడం విచారకరమన్నారు. ఈ నేపథ్యంలో మాన్సాస్ ట్రస్టు వ్యవహారంపై జోక్యం చేసుకోవాలని లేఖ ద్వారా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని విజ్ఞప్తి చేస్తున్నట్లు ఊర్మిళ గజపతి రాజు తెలియచేశారు.
ఇదీ చదవండి: