TSPSC Job Notification 2022 : తెలంగాణలో ఉద్యోగ ప్రకటనల సంవత్సరంగా 2022 నిలిచిపోనుంది. సుమారు 80,000 ఉద్యోగాల భర్తీ చేస్తామన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రకటనకు అనుగుణంగా నోటిఫికేషన్ల పరంపర కొనసాగుతోంది. 8 నెలల్లో రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ 17,457 ఉద్యోగాలతో 22 నోటిఫికేషన్లు జారీ చేసింది. ఈ ఒక్క నెలలోనే 11 నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. నాలుగు గ్రూప్స్ క్యాడర్ల ఉద్యోగాల ప్రకటనలు ఒకే ఏడాది విడుదల కావడం ఇదే మొదటి సారి.
గ్రూప్-1లో 503, గ్రూప్-2లో 783, గ్రూప్-3లో 1365, గ్రూప్-4లో 9,168 పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు ఇచ్చారు. జూనియర్ లెక్చరర్లు 1392, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్1540, వివిధ ఇంజినీరింగ్ విభాగాల్లో 837, పాలిటెక్నిక్ లెక్చరర్ 247 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. సుమారు 80వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించినప్పటికీ.. నోటిఫికేషన్లు ప్రక్రియ మాత్రం ప్రారంభమైంది.
రోజుకో ప్రకటన: ప్రభుత్వం నుంచి ఒత్తిడి ఉండటంతో టీఎస్పీఎస్సీ రోజుకో ప్రకటన విడుదల చేస్తూ వస్తోంది. నోటిఫికేషన్ల జారీలో జాప్యం జరిగితే కొందరు అభ్యర్థులకు వయోపరిమితి దాటే అవకాశం ఉన్నందున ముందయితే ప్రకటనలు విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది. సుమారు మరో 4,000 పోస్టుల భర్తీకి నోటికేషన్లు విడుదల కావాల్సి ఉంది. అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల భర్తీకి గతంలో నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ.. అర్హతల విషయంలో వివాదం తలెత్తడంతో రద్దు చేసింది. త్వరలో ఏఎంవీఐ, అటవీ బీట్ అధికారి, డిగ్రీ లెక్చరర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు టీఎస్పీఎస్సీ సన్నాహాలు చేస్తోంది.
అభ్యర్థుల్లో అయోమయం: వరుస నోటిఫికేషన్లు విడుదల చేస్తున్న టీఎస్పీఎస్సీ.. గ్రూప్స్ సహా ఇతర ఉద్యోగాల నియామక పరీక్ష తేదీలను ప్రకటించకపోవడంతో అభ్యర్థుల్లో అయోమయం నెలకొంది. పరీక్షలు కూడా వరుసగా నిర్వహిస్తే ప్రిపరేషన్ ఎలా కావాలన్న అనుమానం నెలకొంది. అయితే పరీక్షల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటామని.. అభ్యర్థులకు నష్టం జరగకుండా తగిన వ్యవధితో నిర్వహిస్తామని టీఎస్పీఎస్సీ వర్గాలు చెబుతున్నాయి.
గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలపై అభ్యర్థుల్లో గందరగోళం: గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ముగిసినప్పటికీ ఫలితాలు విడుదల కాలేదు. రిజర్వేషన్లకు సంబంధించి హైకోర్టులో వివాదం ఉండటంతో.. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముందుకెళ్లడం లేదు. అయితే ప్రిలిమ్స్ ఫలితాలు ఎప్పుడిస్తారు.. జాప్యం ఎందుకు జరుగుతోందనే విషయాలపై కమిషన్ స్పష్టతనివ్వకపోవడంతో అభ్యర్థుల్లో గందరగోళం నెలకొంది. గ్రూప్-4 పోస్టుల వివరాలు ఆయా శాఖల నుంచి అందక ముందే హడావుడిగా నోటిఫికేషన్ విడుదల చేయడంతో.. దరఖాస్తుల ప్రక్రియలో గందరగోళం నెలకొంది.
ఇవీ చదవండి: