ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని కరోనా భయం బలితీసుకుంది. ఇంటి యజమానికి కరోనా నిర్ధరణ అయిందనే ఆందోళనతో.. ముగ్గురు కలిసి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాద ఘటన విజయనగరం జిల్లా వేపాడ మండలం నల్లబెల్లిలో జరిగింది. కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం... గత 20 ఏళ్ల క్రితం నల్లబెల్లి నుంచి ఉడతా సత్యనారాయణ గుప్తా కుటుంబం గుంటూరు జిల్లాకు వలస వెళ్లింది. అనంతరం రెండేళ్ల కిందట విశాఖ జిల్లా చోడవరం వచ్చి నివసిస్తున్నారు. మధ్యలో ఎన్నడూ సొంతూరుకి రాని గుప్తా కుటుంబం.. ఈరోజు ఉదయం నల్లబెల్లి వచ్చి శివాలయంలో పూజలు చేశారు. అనంతరం భార్య సత్యవతి, అత్త వెంకట సుబ్బమ్మతో కలిసి పురుగుల మందు తాగి బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు.
ఇదీ చదవండి: భార్యపై ప్రేమతో.. ఇంట్లోనే నిలువెత్తు విగ్రహం
మూడు రోజులుగా సత్యనారాయణ గుప్తా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. చికిత్స పొందుతూ ఇంటి వద్దే ఉంటున్నా.. ఒంట్లో నీరసం గా ఉందని చెప్పినట్లు కుమార్తె పూర్ణ తెలిపింది. రాత్రి ఫోన్ చేసినప్పుడు బాగానే ఉంది అని చెప్పి.. ఉదయానికి ఇలా ఆత్మహత్య చేసుకున్నారని కన్నీరుమున్నీరైంది. కరోనా నిర్ధరణ కావడంతో ముగ్గురూ ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమికంగా తెలుస్తోందని శృంగవరపుకోట సీఐ సింహాద్రి నాయుడు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి పూర్తి స్థాయి విచారణ చేపడుతున్నట్లు వెల్లడంచారు.
ఇదీ చదవండి: ప్రాణవాయువు అందించిన ప్రాణదాత ఛారిటబుల్ ట్రస్ట్