విజయనగరం జిల్లా డెంకాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మౌలిక సదుపాయాల కొరత అధికంగా ఉంది. మండల కేంద్రంలో ఉన్న ఈ కళాశాల., మండలంలోని ఇంటర్ చదివే పేద విద్యార్ధులకు ఇదే దిక్కు. ఇక్కడ రెండు సంవత్సరాలకు సంబంధించి 250మంది విద్యార్ధులున్నారు. విద్య, ఫలితాల పరంగా ప్రైవేటు కళాశాలలకు ఇది పోటీగా నిలుస్తోంది. అయితే... కళాశాలను మౌలిక వసతుల సమస్య వెంటాడుతోంది. ముఖ్యంగా కళాశాలలో మొత్తం ఆరు తరగతి గదులు ఉండగా.. ప్రస్తుతం నాలుగు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. తరగతులు, ప్రయోగశాలను ఒకే గదిలోనే నిర్వహిస్తున్నారు. ఆ కారణంగా ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు వాపోతున్నారు.
ఇంకా ఎన్నో సమస్యలు
అదే విధంగా కళాశాలలో విద్యార్థులను తాగునీరు, మరుగుదొడ్ల సమస్య సైతం వేధిస్తోంది. మంచినీరును విద్యార్థులు ఇంటి నుంచే తెచ్చుకుంటున్న పరిస్థితి నెలకొంది. పుష్కలంగా నీరు, విద్యుత్తు మోటారు ఉన్నప్పటికీ., ట్యాంకు లేకపోవటం సమస్యగా మారింది. మరుగుదొడ్లు ఉన్నా.. నిర్వహణ లేకపోవటం వల్ల తలుపులు విరిగి. నిరుపయోగంగా మారాయి. దీనివల్ల విద్యార్థినులు ఇబ్బందులకు గురవుతున్నారు. సువిశాల క్రీడామైదానం ఉన్నా.. పిచ్చి మొక్కలతో, గోతుల మయంగా మారి పనికిరాకుండా పోయిందని విద్యార్థులు అంటున్నారు. రక్షణగోడ లేకపోవటంతో స్థానికులు కళాశాల ఆవరణను పాడుచేస్తున్నారని చెబుతున్నారు. కళాశాల ఆవరణలోని వేదిక సైతం శిథిలావస్థకు చేరుకుని అధ్వాన్నంగా దర్శనమిస్తోందని విద్యార్ధులు విచారం వ్యక్తం చేస్తున్నారు.
కళాశాలను సమస్యలు ఎప్పటి నుంచో వెంటాడుతున్నాయని., వీటివల్ల విద్యార్ధులతో పాటు బోధన, బోధనేతర సిబ్బంది కూడా ఇబ్బందులు పడుతున్నట్లు అధ్యాపకులు వాపోతున్నారు. సమస్యలను ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులు, పాలకుల దృష్టికి తీసుకుపోతున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ చెప్పారు. ఇప్పటికైన ఉన్నతాధికారులు, పాలకులు కళాశాల సమస్యలపై దృష్టి సారించి.. పరిష్కరించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.