పార్వతీపురం డివిజన్‌లో ఎన్నికలు ఆసక్తిగా మారాయి. వైకాపా, తెదేపా నువ్వానేనా అన్నట్లుగా పోటీ పడుతున్నాయి. నాలుగు నియోజకవర్గాల్లో వైకాపా ఎమ్మెల్యేలు అలజంగి జోగారావు, శంబంగి వెంకటచినప్పలనాయుడు, రాజన్నదొర, పుష్పశ్రీవాణి ఉన్నారు. తెదేపా నుంచి సంధ్యారాణి, ద్వారపురెడ్డి జగదీశ్వరరావు, శత్రుచర్ల విజయరామరాజు ఎమ్మెల్సీలు. వీరంతా మండల, గ్రామస్థాయిలో ఇప్పటికే సమావేశాలు నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి వ్యక్తిగత కారణాలతో ఎన్నికలకు దూరంగా ఉండగా.. ఆమె భర్త అరకు పార్లమెంటరీ వైకాపా సమన్వయకర్త పరిక్షిత్‌రాజు అన్నీ తానై వ్యవహరిస్తున్నారు.
నేరుగా రంగంలోకి..
విజయనగరం డివిజన్‌లో అగ్రనేతలు రంగంలోకి దిగి పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తున్నారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ జనవరి 28 జిల్లాలోని వైకాపా ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి మంగళవారం మండల నాయకులతో సమాలోచనలు జరిపారు. తెదేపా పార్లమెంటరీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున శ్రేణులను సన్నద్ధం చేస్తూ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. మంత్రి బొత్స సత్యనారాయణది కూడా ఇదే నియోజకవర్గం కావడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు అశోక్ గజపతిరాజు, విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గ బాధ్యురాలు అదితి గజపతిరాజు ప్రధాన నాయకులతో తరచూ సమావేశమై సూచనలు చేస్తున్నారు. భాజపా ఎన్నికల పరిశీలకుడు ఎ.శ్రీరాం బొండపల్లిలో ప్రత్యేంగా చర్చించారు. ఎమ్మెల్సీ మాధవ్ కూడా తరచూ జిల్లాలో పర్యటిస్తూ శ్రేణులను ఉత్సాహపరుస్తున్నారు.
అంతర్గత సెగ
ఏకగ్రీవాలపై దృష్టి పెడుతున్న పార్టీలను అంతర్గత సెగ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. పలు మండలాల్లో సొంత పార్టీల్లోనే ఇద్దరు అంత కంటే ఎక్కువ మంది అభ్యర్థులు ఒకే పదవికి బరిలో నిలుస్తున్నారు. ఎవరూ వెనక్కి తగ్గని పరిస్థితి నెలకొనడంతో నాయకత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. జిల్లాలోని దాదాపుగా అన్ని మండలాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ప్రధానంగా ఓ పార్టీలో ఎక్కువగా ఉంది. దీంతో బుజ్జగింపులకు నేరుగా ప్రధాన నాయకులు రంగంలోకి దిగుతున్నారు.
సొంతవారి నుంచే పోటీ..
కొన్ని పంచాయతీల్లో బంధువర్గం, రక్త సంబంధీకులు పోటాపోటీకి దిగుతున్నారు. పార్వతీపురం నియోజకవర్గంలోని ఓ పంచాయతీలో ఇద్దరు అన్నదమ్ములు పోటీకి సిద్ధమయ్యారు. వీరిద్దరూ ఒకే పార్టీకి మద్దతుదారులుగా ఉన్నారు. ఎవరు గెలిచినా తమ వారే అని చెప్పుకోవచ్చుననే అభిప్రాయం ఉన్నప్పటికీ, ఇదెంత వరకు ఫలితాన్నిస్తుందో వేచిచూడాల్సిందే. మరోచోట బంధువులు పోటీలో ఉన్నారు. ఈ క్రమంలో ఆశావహులు పార్టీలు మారుతున్నారు. చీపురుపల్లి, గజపతినగరం, బొబ్బిలి, నెల్లిమర్ల నియోజకవర్గాల్లో పలువురు ఒక పార్టీని వీడి మరో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. సాలూరు, డెంకాడ, బొబ్బిలి, పార్వతీపురం నియోజకవర్గాల్లో పలువురు వేరే పార్టీ కండువాలు కప్పుకొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో చిన్నచిన్న నాయకులు పార్టీని వీడినా అది గెలుపుపై ప్రభావం చూపుతుందనే ఆందోళన అభ్యర్థుల్లో కనిపిస్తోంది.
ఇవీ చూడండి...: ఏకగ్రీవ నాయకుడికి అవి లేకుంటే పల్లెకే నష్టం